అమరావతి, ఆంధ్రప్రభ : గర్భిణీలను రక్తహీనత సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రక్తహీనత సమస్య మాత్రం తొలగని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషకాహారాన్ని అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు వైద్య సేవలను కూడా అందిస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఇంత చేసినా ఇంకా 30 శాతానికిపైగా గర్భిణీలు రక్తహీనతతో సతమతమవుతున్నట్లుగా వెల్లడవుతోంది. అంగన్వాడీల్లో నమోదు చేసుకున్న గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ప్రతి నెల విధిగా ఈ పథకం కింద గర్భిణీలకు అవసరమైన పరీక్షలను చేస్తున్నారు.
అయితే అనేకమంది మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఈ వైద్య పరీక్షల్లో వెల్లడవుతోంది. ష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనే ఈ సమస్య గర్భిణీల్లో అధికంగా ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా స్పష్టమవుతోంది. కొన్ని జిల్లాల్లో 30 శాతం లోపే గర్భిణీలు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం 40 శాతానికి మించి ఉన్నట్లుగా వెల్లడవుతోంది. సాధారణంగా మహిళల్లో హిమోగ్లోబిన్ 12 నుంచి 14 శాతం ఉండాలి. అయితే చాలామందిలో 7 నుంచి 9 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉండటం రక్తహీనత సమస్యను స్పష్టం చేస్తోంది. సాధారణంగా గర్భం దాల్చిన మహిళల్లో రక్త నిల్వలు కొద్దిగా తగ్గుతాయని దీన్ని నివారించేందుకు ఫోలిక్ యాసిడ్‌తో పాటు ఇతర సప్లిమెంట్స్‌ను అందిస్తామని వైద్యులు అంగన్వాడీలు చెప్తున్నారు. ఇదే సమయంలో తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి, బలానికి అవసరమైన పౌష్టికాలను అందిస్తున్నామని అయినప్పటికీ కొద్దిమందిలో రక్తహీనత సమస్యలు అలాగే ఉంటున్నాయని అంగన్వాడీ వర్కర్లు పేర్కొంటున్నారు.
ప్రతి నెల విధిగా పరీక్షలు నిర్వహిస్తూ వారికి అవసరమైన మేరకు అదనపు పౌష్టికాన్ని కూడా అందిస్తున్నామని రాగి, జొన్న పండితో పాటు అటుకులు, బెల్లం, చిక్కీలు, పోషణ ప్లస్ పథకంలో భాగంగా ఇస్తున్నట్లుగా స్సష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న ఈ పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సక్రమంగా తీసుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని తినకపోవడంతో రక్త హీనత సమస్య ఇంకా వెన్నాడుతున్నట్లుగా కొందరు అధికారులు చెబుతున్నారు. సమగ్రమైన ఈ పోషకాహారాన్ని విధిగా తీసుకుంటే గర్భిణీల్లో రక్త హీనత సమస్య ఉండదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న తరుణంలో వారికి ఇంకా మెరుగైన పౌష్టికంతో పాటు అవసరమైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అంగన్వాడీల ద్వారా సమీప ఆరోగ్య కేంద్రాల్లో నెలకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మరిన్ని పౌష్టికాలను అందించే దిశగా కృషి చేస్తోంది. ఇంకోవైపు రక్త హీనత సమస్యను అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాతా, శిశు మరణాలు బాగా అదుపులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు రక్త హీనత ఒక సమస్యగా మారడంతో దీన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పకడ్భందీగా చర్యలు తీసుకుంటోంది.