తిరుపతి – ఏపీలో పోలింగ్ ముగిశాక కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. పులివర్తి నాని ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టిడిపి నేతలు ఆరోపించారు. నడవలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే దాడులకు దిగారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసిపి మూకలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
దాడి సమాచారం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైకాపా జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు.
మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైకాపా గూండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి.