Sunday, November 10, 2024

Andhra Pradesh – ఆర్థిక ఇబ్బందుల‌తోనే బ‌డ్జెట్ పెట్ట‌లేక‌పోతున్నాం… అసెంబ్లీలో చంద్ర‌బాబు

అమరావతి: ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్‌ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనుకున్నామని అన్నారు. వికసిత్ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని అన్నారు.

ఏపీ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి 12 గంటల వరకూ ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓటేసిన ఓటర్లందరికీ పాదాభివందనం చేస్తున్నామన్నారు. 2047 వికసిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చిన పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి కండీషన్ లేకుండా పవన్ తమకు మద్దతిచ్చారని మరోసారి చెప్పారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏపీ ప్రజల్లో చైతన్యం వచ్చిందనేందుకు నిదర్శనమన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి 57 శాతం ఓట్లు పడ్డాయని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఫలితం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇది మార్పుకు సంకేతమన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమాయక ప్రజల మెడపై కత్తులు పెట్టి.. భూములను, ఆస్తుల్ని రాయించుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా చేశారని దుయ్యబట్టారు. అంతకుముందు టీడీపీ హయాంలో పల్లెల్లో చదువుకుని ఐటీ దిగ్గజాలుగా ఎదిగినవారున్నారని గుర్తు చేశారు.

నాడు మద్రాసుతో విడిపోయి.. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న చంద్రబాబు ఇప్పుడు పదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఐటీ రంగానికి చాలా ప్రాధాన్యమిచ్చామని, వైసీపీ హయాంలో అది కరువైందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు కావలసిన నిధులను ఇస్తామని కేంద్రం చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సమిష్టిగా కృషిచేస్తే ఏపీని అభివృద్ధి చేయడం కష్టం కాదన్నారు.

వైసీపీ తీరుతో ఏపీ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి.. తీరని నష్టం చేశారన్నారు. ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అభివృద్ధి కుంటుపడేలా చేశారన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ఒక్క మైనింగ్ లోనే రూ.20 వేల కోట్లను దోచుకున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఎన్నికల్లో ఖర్చు చేశారని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఐదేళ్లు మూడు రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం నెట్టుకొచ్చిందన్నారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచారన్నారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాస్ అనే వారని.. కానీ తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్ అనేలా చేసిన ఘనత మాత్రం ఎన్టీఆర్‌దేనని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పటాయిందని తెలిపారు. వికసిత భారత్ వైపు భారత్ అడుగులు వేస్తుందన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే తొలి స్థానం లేదా రెండో స్థానంలో ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement