Tuesday, September 24, 2024

Andhra Pradesh – వలంటీర్లకు రైట్ రైట్… డ్రాప్ ఔట్స్‌కు నో చాన్స్

తెరమీదకు ఇక‌పై కొత్త వ్యవస్థ
2.29 లక్షల మంది విధులకు హాజరు
వేత‌నాల‌ పెంపుదల ఖాయమే
గ్రామానికి అయిదుగురు వలంటర్లు
సర్పంచుల ఆధీనంలోనే ప‌నులు
రాజీనామా చేసిన వారు.. అంతే సంగ‌తి

- Advertisement -

సరికొత్త కీలక నిర్ణయాలతో ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరనున్న తరుణంలో.. జనాభిమానం లక్ష్యంగా పాలనకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. సూపర్ సిక్స్ నినాదంతో 25 హామీలను గుమ్మరించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి.. తమ హామీలను అమలు చేయాలంటే ఎన్నో వ్యవస్థలను ప్రక్షాళనం చేయకతప్పదు. పునర్నిర్మాణ అనివార్యం. ఈ స్థితిలో ప్రజాపాలనకు వలంటరీ వ్యవస్థే కీలకం. గతంలో జన్మభూమి కమిటీలతో ప్రజలకు దూరమైన తెలుగుదేశం ప్రభుత్వం.. ఈ సారి పాత తప్పిదాల పునరావృతానికి ససేమిరా అంటోంది. అప్పట్లో జన్మభూమి కమిటీలకు ఎలాంటి గౌరవ భృతి లేదు. ఫలితంగా ఆమ్యామ్యాల పర్వం ప్రభుత్వం కొంపను ముంచింది. వివక్ష, లంచాలు లేని వలంటీర్ వ్య‌వ‌స్థను ఏర్పాటు చేసిన జగన్ ప్ర‌భుత్వం చివరి దశలో.. వలంటీర్లను రాజకీయ సైన్యంగా ప్రయోగించబోయి బోర్ల పడింది. ఈ విపత్కర స్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం తాజాగా.. వలంటీర్ల వ్యవస్థ పునర్నిర్మాణంపై దృషి సారించింది.

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:

ఎన్నికల సమయంలో ఏపీలో వివాదాస్పదంగా మారిన వలంటీర్ల వ్యవస్థ మార్పులు, చేర్పులపై భారీ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ సైన్యంగా జగన్ ప్ర‌కటిస్తే.. స్వచ్ఛంధ సేవగా.. వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వ‌లంటీర్ల నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జీతం పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ వలంటీర్ల వేతనం ₹10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ స్థితిలో వలంటర్లీలో ఉద్యోగంపైనే ఆశ పెరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 24గంటల్లోనూ వలంటీర్లలో పెనుమార్పు వచ్చింది. రాజీనామా చేయని సుమారు 2 లక్షలకు పైగా వలంటీర్లు గురువారం విధులకు హాజరైనట్టు తెలుస్తోంది.

ఎన్నికల కాలంలో విధులకు దూరం..

వైసీసీ ఎమ్మెల్యే సిఫార్సులతో గ్రామాల్లో చక్రం తిప్పిన వలంటీర్లు.. ఎన్నికల కమిషన్​ విధులకు దూరంగా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించటం.. పైగా అధికారంలోకి రావటంతో వలంటీర్లలో తమ భవిష్యత్తుపై ఆశ పెరిగింది. మన బతుకు తీరు మారుతుంది అనే రీతిలో సచివాలయాల్లో డ్యూటీకి వస్తున్నట్టు తెలుస్తోంది.

రాజీనామా చేసిన వారిలో ఆందోళన..

వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుల్లా వ్యవహరించిన వలంటీర్లకు గుండె కోత తప్పలేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల కట్టడిని ధిక్కరించిన ఎమ్మెల్యేలు.. విధులకు సహాయ నిరాకరణ మంత్రం పాటించారు. తమ వలంటీర్లను రాజీనామా చేయించారు. ఫలితంగా వృద్ధులకు పెన్షన్ల పంపిణీ నీరుగారిపోతుందని, దీనికి కారణం తెలుగుదేశం కూటమేనని ప్రచారాస్త్రం సంధించారు. ఫలితంగా ఏపీలో 65 వేల మందికి పైగా రాజీనామా చేసి.. తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయంలో అప్పగించారు. వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయంలో రింగ్ మాస్టార్లుగా చక్రం తిప్పుతామని ఆశించారు.

అనకాలపల్లి జిల్లాలో అత్యధికం..

ఇందులో అనకాపల్లి జిల్లాలో 8,550 మంది వలంటీర్లకు గాను 2,143 మంది, కాకినాడ జిల్లాలో 6,100 మందికి గాను 700మంది, బాపట్ల జిల్లాలో 8,400 మందికి గాను 4,800 మంది రాజీనామా చేశారు. బాపట్ల జిల్లాలో కోడ్‌ ఉల్లంఘన కింద 42 మందిని సస్పెండ్‌ చేశారు. కృష్ణా జిల్లాలోనూ చిత్తూరు జిల్లాలో 9వేల మందికి గాను 3వేల మంది ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. వీరిలో, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 9వేల మందికి గాను 2,351 మంది రాజీనామా చేశారు. అంతే కాదు, నాయకుల మాటలు విని రాజీనామా చేసిన వలంటీర్ల స్థితి గతి మారిపోయింది. టీడీపీ అభ్యర్థులు విజయం సాధించటంతో.. ఈ ఎన్నికల్లో వలంటర్లీలు సక్రమంగా పని చేయలేదని, ఓట్ల కొనుగోలుకు ఇచ్చిన సొమ్మును నొక్కేశారని వలంటీర్లపై మరో నింద తప్పలేదు.

సరికొత్త నోటిఫికేషన్​కు కసరత్తు

రాజీనామా చేయని వలంటీర్లను కొనసాగిస్తూ.. రాజీనామా చేసిన వలంటీర్లు స్థానంలో నియామకాల కోసం తాజాగా కసరత్తు జరుగుతోంది. ఇక ప్రతీ గ్రామంలో ఐదుగురు మాత్రమే వలంటర్లు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది. వలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుంచి 2003 వరకు వయసు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులుకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు.

బట్వాడాలోనూ మార్పులు

సంక్షేమ పథకాల అమలులో ఇప్పటి వరకు ప్రతీ నెలా ఇంటింటికి వలంటీర్ వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేది. దీనిపైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా? ప్రస్తుత విధానం కొనసాగించాలా? అనే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిథ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. పాలనలో కీలకంగా మారునున్న వలంటీర్ వ్యవస్థపై అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement