( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ -2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలను చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోం మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, “నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తాం.. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలి, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలి, సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. బాధితులు కోరితే తప్పకుండా కేసులను తప్పని సరిగా రీఓపెన్ చేస్తాం” అని మంత్రి అనిత స్పష్టం చేశారు.