ఇటు పని లేనోళ్లు.. అటు సిబ్బంది కొరత
కీలక శాఖల్లో మార్పులు తప్పవా?
పంచాయతీరాజ్.. గృహనిర్మాణ శాఖల్లో కసరత్తు
14 వేల మందికి తప్పని స్థాన చలనం
జనంలో సచివాలయ సేవలపైనే మక్కువ
ఆంధ్ర ప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: అయిదేళ్ల కాలంలో గ్రామీణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పరిపాలన వ్యవస్థ కాస్త రాజకీయ తొత్తు సంస్థగా మారిందనే ఆలోచనతోనే ఈ కొత్త ప్రభుత్వం సరికొత్త కసరత్తులు చేస్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి సచివాలయాల ఏర్పాటుతో గ్రామీణుల్లో.. సచివాలయంపై ఆపార గౌరవం పెరిగింది, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి రైతులకు 1బీ, అడంగల్, ఆధార్, రేషన్ కార్డు ప్రింట్, టైటిల్ డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్టిఫికెట్ కాపీ, విద్యుత్ కనెక్షన్ కేటగిరీ మార్పు తదితర 47రకాల సేవలను పొందుతున్నారు. గతంలో ఈ తతంగానికి నానా అష్టకష్టాలు తప్పేవి కాదు. వీఆర్వో నుంచి తాహసీల్దార్ కార్యాలయం వరకూ.. అమ్యామ్యా లేనిదే పనులు జరిగేవి కాదు. మరి ఇప్పుడు ఈ సచివాలయం వ్యవస్థను తారుమారు చేసి, మరింతగా చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
మెరుగైన పాలన దిశగా చర్యలు..
ఏపీలో సీఎం చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వనిర్ణయాలపై ప్రక్షాళన మొదలు పెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం వార్డు -గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా భావించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సచివాయల ప్రక్షాళన దిశగా అడుగులువేస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులను ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఏపీలో మొత్తం 15002 గ్రామ, పట్టణ సచివాలయాలున్నాయి. ఇందులో 1.5లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 536 సేవలను ప్రజలకు అందించాలన్నది సచివాలయం లక్ష్యం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 నుంచి 536 సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కేవలం 15 నిమిషాల వ్యవధిలో కొన్ని సేవలు పొందవచ్చు. 148 సేవలు మూడ్రోజుల్లో పరిష్కరిస్తారు. మిగిలిన వాటిని మూడు రోజుల అనంతరం ఒక్కో సేవకు నిర్ణీత వ్యవధి ఉంది. ఈ సేవలకు ప్రత్యేక పోర్టల్ ఉంది.
కీలక శాఖలపై దృష్టి..
జనానికి అందుతున్న సేవలను పక్కన పెడితే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ సంస్థ, గ్రామీణ నీటిసరఫరా, రోడ్డు భవనాల శాఖ.. ఈ శాఖల్లో సిబ్బంది పల్లెల్లో పని కనిపించటం లేదని ఓ అభియోగం తప్పలేదు. ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను (మౌళిక వసతుల కల్పన కార్యదర్శి) ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తోంది. ఈ రెండు విభాగాల్లో సుమారు 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, ఆర్డబ్లుఎస్ శాఖలకు బదిలీ చేసి, ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కొత్త సర్కారు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిర్మాణాల్లో నాణ్యతపై ఫోకస్..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, ఆర్డబ్లుఎస్ శాఖలకు పనులకు గత ప్రభుత్వం కనీసం ఒక్క పైసా కూడా విదల్చలేదు. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల నిర్మాణం పనుల ఊసే లేదు. పంచాయతీలు నీరుగారి పోయాయి. ఈ స్థితిలో ఈ శాఖల సిబ్బంది సాధ్యమైనంత వరకూ సచివాలయంలో గోళ్లు గిల్లుకున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి అభివృద్ధి కార్యాక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి అమలులో అమినిటీస్ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పాత్ర చాలా కీలకం. ప్రత్యేకించి నిర్మాణ రంగంలో గృహాల నిర్మాణ ప్రణాళికకు ఆమోదం మొదలుకొని నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. మంచినీటి పైపులైన్లు, రహదారులు, కాల్వల పనుల పర్యవేక్షణ, అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరి చేయాలి.
ఇక్కడ పని లేదని…
ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పనులు నత్తనడకనసాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన మూడు డీజీఎం , రెండు జనరల్ మేనేజర్లు, ఒక ఈడీ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యుఎస్ శాఖల్లో ఉన్న ఖాళీలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
పల్లెల్లో తప్పని తాగునీటి సమస్యలు..
కానీ గ్రామీణ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి .. కావాల్సింది నిధులు. అభివృద్ధి సంక్షేమం నినాదంతో పాలన ఆరంభించిన ఎన్డీయే కూటమి.. ఒకరి పాలనలో లోటుపాట్లపై ఆగ్రహంతో వ్యవస్థనే చిన్నాభిన్నం చేయటం తగదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నేటికీ అనేక పల్లెల్లో తాగునీటి ఎద్దడి, పారిశుద్ధ్య సమస్యరాజ్యమేలుతున్నాయి. ఇక గృహనిర్మాణం పేరుతో అన్నీ అక్రమాలే. ఇవ్వన్నీ ఈనాటివి కాదు. గ్రామాలకు సిబ్బందిని చేర్చి.. పని కల్పించక పోవటం ప్రభుత్వ అసమర్థత అవుతుంది. అందుకే సచివాలయ వ్యవస్థలో లోటుపాట్లను గుర్తించి .. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడపాలని జనం కోరుకొంటున్నారు.