Friday, November 22, 2024

Andhra Pradesh – పసుపు సేనలో సిగ‌ప‌ట్లు – ఆ ఆరు సీట్ల‌కు జ‌గ‌డాలు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) తాము పోటీ చేస్తున్న 144 నియోజకవర్గాల్లో 138 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ఆరు నియోజకవర్గాలను ఎందుకు వదిలేశారు? ఈ స్థానాలను పక్కన పెట్టటంలో ప్రత్యేక వ్యూహం ఉందా? లేక సమర్థులు లభించలేదా? ఆరు సీట్లపై టీడీపీ కసరత్తు ఏంటి? ఆ ఆరు ప్రాంతాల్లో స్లో సైక్లింగ్కు కారణమేంటీ?

మార్పుతోనే అస‌లు ర‌గ‌డ

టీడీపీ పెండింగ్ పెట్టిన ఆరు స్థానాల్లో దాదాపు నాలుగు చోట్ల సీనియర్ నేతలు టికెట్లు ఆశిస్తుంటే.., అక్కడ ప్రత్యర్థులు బలంగా ఉండటంతో టీడీపీ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది . ఉత్తరాంధ్రలోని చీపురుపల్లి, భీమిలి.. రాయలసీమలోని అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ ఆరు స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరాం, ప్రభాకర్ చౌదరి తదితర సీనియర్లు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ సీనియర్లుగా చెప్పే తమ సొంత నియోజకవర్గాలోనే పోటీ చేస్తామని, ఇతర స్థానాలకు వెళ్లే ప్రసక్తి లేదని భీష్మించటంతో అసలు సమస్య ఎదురైంది. టికెట్ల ఖరారు పెండింగ్ పడింది.

చీపురుప‌ల్లిలో గంటా.. – క‌ళా

చీపురుపల్లి నుంచి ఇద్దరిలో ఒకరు పోటీ చేయాలని కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావులకు చంద్రబాబు ఖరాఖండీగా చెబుతుండటంతో ఆ ఇద్దరూ డైలమాలో పడిపోతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరికీ చీపురుపల్లితో పెద్దగా సంబంధాలు లేవు. ఓ విధంగా కళా వెంకట్రావు సోదరుడి భార్య మృణాళిని ఆమె కుమారుడు నాగార్జున గత పదేళ్లుగా చీపురుపల్లి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆ ఇద్దరి వల్ల టీడీపీకి చీపురుపల్లిలో డ్యామేజ్ జరిగిందని పార్టీ హైకమాండ్ కు రిపోర్టు రావడం ఆ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న బొత్స ప్రాతినిధ్యం వహించటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.రు. గంటా లేదా కళా ఇద్దరిలో ఎవరో ఒకరు చీపురుపల్లిలో పోటీకి సమ్మతిస్తే భీమిలిపైనా సస్పెన్స్ తొలగిపోయే ఛాన్స్ ఉంది. కళా సొంత నియోకవర్గం రాజాం ఎస్సీ రిజర్వు కావడంతో ఆయన మూడు ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో.. కళాకు ప్రత్యామ్నాయంగా చీపురుపల్లి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇలా చీపురుపల్లిపై సస్పెన్స్ వీడితేనే కళా, గంటా పోటీపైన సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.

- Advertisement -

గుమ్మనూరు గుంభనం
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి గుంభనంగా మారింది. తన సిట్టింగ్ స్థానం ఆలూరు టికెట్ ను నిరాకరించారనే కారణంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు.ఆలూరులో మహిళా నేత, కోట్ల సుజాతమ్మ అభ్యర్థనతో జయరాంకు పక్క జిల్లాలోని గుంతకల్లు సీటు ఇస్తామని హామీ ఇచ్చారుజయరాం కూడా ఇందుకు సిద్ధమే అన్నారు. కానీ, మూడో జాబితా విడుదల చేసినా.. అందులో జయరాం పేరు లేదు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మూడింట ఊగిసలాట..

ఇక మిగిలిన నియోజకవర్గాల్లో అనంతపురం అర్బన్, దర్శి, రాజంపేట స్థానాలపై మిత్రపక్షాలతో ఊగిసలాట కొనసాగుతోంది. దర్శి స్థానాన్ని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధా.. దర్శి టికెట్ ఇస్తే టీడీపీలోకి వచ్చేస్తామని సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.

అనంతపురం కోసం జనసేన పట్టు..
ఇక అనంతపురం అర్బన్ నుంచి సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. . ఇక రాజంపేటలోనూ సమర్థుల కోసం అన్వేషణలో భాగంగా పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఆరు సీట్లకు అభ్యర్థుల ఎంపిక అధినేతకు సవాల్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో నలుగురు సీనియర్ల రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉండటంతో టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠకు గురి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement