Friday, November 22, 2024

Andhra Pradesh – కేబినెట్​పై కసరత్తులు…సీనియర్లకు బెర్తులు ఖాయం

ఏపీలో పసుపు కాషాయ సేన మంత్రి వర్గం కూర్పుపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మిత్రపక్షానికి కీలక మంత్రివర్గ బెర్తుల‌ను కేటాయించే విషయంపై.. ఎన్డీఏ కూటమితో టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్షేత్ర స్థాయిలో చర్చలు జరిపారు. టీడీపీ, జనసేన, బీజేపీల‌ బలాబలాలు దామాషా ప్రకారం ఎన్నికల్లో గెలిచిన నేతల స్థితిగతులను అంచనా వేస్తున్నారు. ఈ నెల 12న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మూడు పార్టీల నేతలతో తన కొత్త కేబినెట్ కూర్పు పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు సీనియర్లు కేబినెట్ బెర్త్ రేసులో ఉన్నారు. జనసేన, బీజేపీ నుంచి ఆశావ‌హులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యంతో యువత, మహిళలకు గుర్తింపు ఇస్తూ కేబినెట్ సిద్దం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – ఎన్నికల కౌంటింగ్ అలా ముగిసిందో లేదో.. అప్పుడే మంత్రిమండ‌లిలో స్థానం కోసం కూటమి సీనియర్లు గంపెడాశతో తాడేపల్లికి బయలు దేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆశీస్సులు, హామీల కోసం ప్రణామాలు చేశారు. జనసేన కార్యాలయంలోనూ ఆశావహులు క్యూకట్టారు. ఇక కేబినెట్ కూర్పు కసరత్తులో చంద్రబాబు తన శైలిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు క్షుణ్ణంగా చర్చించారు. మరో సారి కీలక నిర్ణయంపై చర్చించనున్నారు. ఈ కేబినెట్ లో మొత్తం 25 మందికి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాపు, బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్లు, యువతకు ప్రాధాన్యంతో కూర్పు జరుగుతున్నట్లు సమాచారం.

రేసులో టీడీపీ సీనియర్లు
మంత్రి మండలిలో చోటు కోసం పలువురు టీడీపీ సీనియర్లు రేస్‌లో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని, నిమ్మల రామానాయుడు, కనుమూరి రఘురామరాజు, కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, బోండా ఉమరేసులో ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు లోకేష్‌కు తమ విన్న‌పాల‌ను విన్నవించారు.

టీడీపీలో కొందరికి బెర్త్ కన్ఫర్మ్

కేబినెట్ బెర్త్ కేటాయింపులో వెయిటింగ్ లిస్ట్, తత్కాల్ ప‌థకాలతో సంబంధం లేకుండా నేరుగా కొందరు సీనియర్లకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, ఆనం రామనారమణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి ఛాన్స్ కనిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, కడప నుంచి సుధాకర్ యాదవ్, మాధవి రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీల నుంచి ఫరూక్, మహిళల నుంచి బండారు శ్రావణి, ఎస్టీల నుంచి శిరీషాదేవి, బీసీల నుంచి యనమల దివ్య, సవిత పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

- Advertisement -

మిత్రపక్షాల్లో ఆరుగురికి చాన్స్.. !?

కేబినెట్ లో కూర్పులో ఆరుగురు మిత్రపక్షాలకు ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి ముగ్గురికి చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి వర్గంలోకి వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్ కు ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ నుంచి ముగ్గురికి అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు లో ముగ్గురికి చాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు బిజీబిజీ
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు తో పాటుగా కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన ముఖ్యనేతలు ప్రాథ‌మికంగా చర్చలు చేశారు. మొత్తం 25 మంది ఉండే మంత్రివర్గంలో టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామక్రిష్ణకు జనసేన నుంచి కేబినెట్ లో చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బీసీ వర్గానికి దక్కే డిప్యూటీ సీఎం పదవి ఉత్తరాంధ్ర నుంచి కొణతాలకు ఇచ్చే అవ‌కాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప, లేదా నిమ్మల రామానాయుడుకు కాపు కోటాలో డిప్యూటీ సీఎంగా చాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈ సారి మైనార్టీ ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్దులను గెలిపించటంతో ఫరూక్ కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో మూడు పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

పవన్, లోకేష్ పాత్ర‌?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగినా..ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ మంత్రివర్గంలో చేరకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిగా కంటే..పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ..ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఆలోచనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తన తుది నిర్ణయం ఏంటనేది వెల్లడించాల్సి ఉంది. అదే విధంగా.. లోకేష్ పాత్ర పైన టీడీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో..మంత్రిగా పని చేయటం కంటే లోకేష్ పార్టీ వ్యవహారాల పైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో పార్టీ కేడర్ కు లోకేష్ అందుబాటులో ఉంటూ..పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement