Tuesday, November 26, 2024

Andhra Pradesh – ఎండ‌లో తిప్పి తిప్పి సంపుతున్నారు.. పింఛ‌న్ కోసం వృద్ధుల అగ‌చాట్లు

ఏపీలో పండుటాకుల విలవిల
పెన్షన్ కోసం బ్యాంకుల వ‌ద్ద‌ పడిగాపులు
ఎండ దెబ్బ‌కు సొమ్మ‌సిల్లిపోతున్న వృద్ధులు
కేవైసీ చేయ‌లేద‌ని బ్యాంకులో బ్రేక్
సగం పైగా ఎకౌంట్లు ఇన్యాక్టివ్
దరఖాస్తు చేస్తే.. వారం త‌ర్వాత‌ చెల్లింపు
ఉద్యోగులు బయటకు రారా అంటూ మండిపాటు
ముసలోళ్లే ఎండలో తిరగాలా అని ఆగ్ర‌హం
ప్రభుత్వంపై పెన్ష‌న్‌దారుల సీరిస‌య్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో రాజకీయంతో పండుటాకులు అల్లాడిపోతున్నాయి. ఉదయం ఏడుగంటలతో వేసవి నిప్పుల కొలిమిని తలపిస్తుంటే… పెన్షన్ తీసుకోవటానికి వృద్ధులు అల్లాడిపోతున్నారు. పెన్షన్ డబ్బులు తీసుకోవటానికి బ్యాంకుల్లో పడిగాపులు పడుతున్నారు. పెన్షన్‌దారులకురెండో రోజు కూడా తిప్పలు తప్పలేదు. గ్రామాల నుంచి ఆటోల్లో బ్యాంకులకు చేరితే 10 గంటల తరువాత సిబ్బంది కసురుకొంటున్నారు. బ్యాంకు ఖాతాలు కైవైసీ కాలేదని, అకౌంట్ ఇన్ యాక్టివ్ అయిందని, పక్కకు వెళ్లి కైవైసీ చేయించుకోండని చావు కబురు చెబుతున్నారు. ఈ తతంగం పూర్తి కావటానికి గంటపైగా సమయం పడుతోంది. ఒక్కొక్కసారి సర్వర్ మొరాయిస్తోంది.

- Advertisement -

ఇది సరే.. పెన్షన్‌దారులబ్యాంకు అకౌంటుల్లో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వటంతో వృద్ధులకు బ్యాంకులతో పని లేదు. దీంతో బ్యాంకు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అకౌంట్లు ఇన్ యాక్టివ్ కావటంతో అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చిన వారిని వారం రోజులు తరువాత రావాలని కొన్ని బ్యాంక్‌ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దరఖాస్తులు నింపడం కూడా చేతకావడం లేదని పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాంక్‌లకు వస్తున్న సాధారణ ఖాతాదారులను దరఖాస్తులు నింపాలని పెన్షన్‌దారులు ప్రాధేయపడుతున్నారు. మండుటెండలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అల్లాడిపోతున్నారు. శుక్రవారం కూడా ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది. సాయంత్రం నాలుగు గంటల వరకే బ్యాంకుల్లో పెన్షన్ చెల్లిస్తారు.

వృద్ధుల ఆగ్రహం.. శాపనార్థాలు

ఈ ఇబ్బందులు రావడానికి చంద్రబాబే కారణమని వలంటీర్లు చెప్పారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనే ఈ విపత్తుకు కారణమని , అధికారులే ఈ డ్రామాలు ఆడుతున్నారని మరి కొందరు వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇన్ని కష్టాలు పెడుతున్న వీరికి తమ ఉసురు తగులుతుందని పెన్షన్‌దారుల శాపనార్థాలు పెడుతున్నారు.గతంలో ఇళ్లకు ఇచ్చి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల్లో చెల్లించటమేమిటీ? ఈ ఎండల్లో ఎలా రాగలం. ఈ వడగాలికి తట్టుకోగలమా? సచివాలయం ఉద్యోగులు బయటకు రాలేరా? ఆఫీసులో ఏసీల్లో కూర్చుంటారా? పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? వాళ్లేమో ఎండకు బయటకు రారు, మేము ఈ మండుటెండలో చావాలా? అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి పని వాళ్లు చేయకుండా.. ఈ ఇబ్బందులకు కారణాలను ఒకరి మీద మరొకరు వేసుకుంటూ మమ్మల్ని కష్ట పెడుతున్నారని, ఓట్లు వేసేటప్పుడు వీళ్ల సంగతి చూస్తాం అని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement