Friday, November 22, 2024

Andhra Pradesh – జోష్ కోసం రేవంత్ ఫోర్స్‌! …ష‌ర్మిల కోసం ప్ర‌చారానికి రెడీ…

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) – ఆంధ్రుల ఆగ్రహంతో.. అంపశయ్యపైకుయ్యో మొర్రో దశలోని కాంగ్రెస్ పార్టీకి వెంటిలేటర్ అవసరమైంది. వైఎస్సార్‌ తనయ షర్మిల ప్ర‌యత్నంలో కోమా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అత్యవసరం. ఇప్పుడు ప్రాణదాత తెలంగాణ కాంగ్రెస్సే. తెలంగాణాలో పదేళ్ల వనవాసం త‌ర్వాత‌ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మంచి ఊపులో ఉంది. డైనమిక్ లీడర్‌గా రేవంత్ రెడ్డి సీఎంగా చెలరేగిపోతున్నారు. ఆయన రెండు నెలల పాలనతో ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు కొట్టేశారు. అన్నింటికంటే ఎక్కువగా బీఆర్ఎస్‌ని కట్టడి చేసిన తీరు అంద‌రినీ ఆశ్య‌ర్య‌ప‌రిచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆశలన్నీ తెలంగాణ వైపు మళ్లాయి. ఆ పార్టీకి ఈసారి దక్షిణాది రాష్ట్రాలే అతిపెద్ద అండ కాబోతున్నాయి. కేరళ, కర్నాటక , తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.

ఏపీ ప్ర‌చార బాధ్య‌త‌లు రేవంత్‌రెడ్డికి..

తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఉంది. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పవర్‌లో ఉండడంతో ఏపీలో కూడా ప్రభావంతో పరుగులు పెట్టాలని కాంగ్రెస్ ఆశ పడుతోంది. ఇంకో వైపు వైఎస్సార్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్ ప్రభావం ఎంతో కొంత మలుపు తీసుకువస్తుందని మరొక ఆశ. ఇపుడు ఏపీకి కావాల్సిన ఇంధనం, ధనం అన్నీ తెలంగాణ నుంచే రావాలి. ఇమేజీ లీడర్ రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో లోక్ సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారని ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా జనవరి 21న బాధ్యతలు స్వీకరించిన షర్మిల రెండు దఫాలుగా ఏపీలోని అనేక జిల్లాల్లో కలియతిరిగారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలవడం కీలక పరిణామంగా మారింది. ఇటీవల తన కుమారుడి నిశ్చితార్ధం ఇన్విటేషన్ ని రేవంత్ రెడ్డిని కలసి ఇచ్చిన షర్మిల.. మరో విడత కలవడంపై ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. హై కమాండ్ ఆదేశాలతో షర్మిల కలసి ఉండవచ్చనే భావ‌న ఉంది. .

- Advertisement -

ఏపీలో రేవంతన్న గళం ..

ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్నది కూడా మరో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.. ఆయన ఎక్కువగా టీడీపీ అధినేత‌ చంద్రబాబుకు సన్నిహితుడు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్న వేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారా? అన్నది కూడా ఒక చర్చ. ఏది ఏమైనా షర్మిల మాదిరిగానే నూటికి తొంబై శాతం పైగా వైసీపీని విమర్శిస్తూ ఒక పది శాతం టీడీపీని విమర్శించేలా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం ఉండ‌వ‌చ్చుఅనే భావ‌న కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement