Tuesday, November 26, 2024

Andhra Pradesh – రియల్ ​రీ ఓపెన్​! అమరావతిలో ఫుల్​ జోష్​​

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: రాష్ట్ర విభజనతో రాజధాని లేని ఏపీకి అంతర్జాతీయ స్థాయి నిర్మాణం చేప‌ట్టాల‌నుకున్నారు. కొత్తగా సిటీ నిర్మించేందుకు 30 వేల ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించింది. ఇందుకు మూడేళ్లు పట్టింది. అనంతర రోడ్లు.. తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ పనులు జరుగుతుంటే రాజధాని కలనెరవేరుతుందని అమరావతి రైతులు సంబురాలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్న సీఎం జగన్ రాజధాని పనుల స్పీడ్ పెంచుతారని అందరూ ఆశించారు. కానీ, సీన్ మారిపోయింది. మూడు రాజధానులు తెరమీదకు వచ్చాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బూమ్ బూమ్ కాస్తా బుష్ అంటూ చతికిల పడింది. అనూహ్య రీతిలో వైసీపీని జనం చీపురుతో ఊడ్చిపారేశారు. అంతే.. టీడీపీ విజయంతో రాజధాని అమరావతికి పునరుజ్జీవనం వస్తుందని రైతులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలూ వేగం పుంజుకున్నాయి.

స్పీడ్ ట్రాక్​పై అమరావతి..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలిచిన క్షణాల్లోనే అమరావతికి పూర్వ వైభవం ఖాయమని తెలిపోయింది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్రాన్ని యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో అయిదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపు వంద జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. రోడ్లకు మరమత్తులు జరిగాయి. సీడ్ రోడ్ ఇప్పుడు అధునాత రాచ నగరుగా మారిపోయింది. అర్ధరాత్రి వెలుగులతో అమరావతి అదరగొట్టేస్తోంది. అయిదేళ్లుగా ఓ చీకటి నరకాన్ని తలపించిన అమరావతి,, ఇప్పుడు సోయగాలతో అలరిస్తోంది. విజయవాడ నుంచి వేగంగా కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇక మందడంలో నిన్నటి వరకూ ఈగలు తోలిన హోటళ్లు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి.

రియల్ పరుగే పరుగు..

అయిదేళ్ల కిందట అమరావతిలో పనులు ప్రారంభంతో రియల్ ఎస్టేట్‌కు భారీ ఊపు వచ్చింది. పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పడ్డాయి. గుంటూరు, విజయవాడ జంట నగరరాలుగా మారేలా హైవే చుట్టుపక్కల భారీ వెంచర్లు ప్రారంభమయ్యాయి. అపార్ట్​మెంట్లూ వెలిశాయి. ఇక్కడ విజయవాడ నుంచి గొల్లపూడి, విజయవాడ నుంచి మంగళగిరి, విజయవాడ నుంచి అమరావతి.. ఇక గుంటూరు నుంచి అమరావతి వైపు రోడ్ల పక్కన పొలాలన్నీ వెంచర్లుగా మారిపోయాయి. గజం స్థలం విలువ ₹35వేలు పలికింది. కానీ టీడీపీ ఓడిపోవడం, జగన్ మూడు రాజధానుల యజ్ఞంతో రియల్​ రంగం మొత్తం డౌన్ అయ్యింది. తాజాగా టీడీపీ అధికారంలో రావడం.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మళ్లీ భవన నిర్మాణ రంగం ఊపందుకుంది. గత అపార్ట్​మెంట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఖాళీ స్థలాలకు ఫుల్​ డిమాండ్​..

అమరావతిలోని ఖాళీ స్థలాలకూ గిరాకీ పెరిగింది. గడచిన ఆరు నెలల కిందట అమరావతి హైకోర్డు సమీపంలో గజం స్థలం ₹16 వేలు పలికింది. రాజధాని వస్తుందా చస్తుందా? అని ఇక్కడ స్థలాలను ఎవ్వరూ కొనలేదు. ఇప్పుడు హైకోర్టు సమీపంలోని గజం స్థలం లక్ష రూపాయలకు చేరింది. అయ్యో అప్పుడెందుకు కొనలేదని ఆశావహులు తమను తాము నిందించుకొంటున్నారు. ఇక.. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అపార్ట్ మెంట్లలో ప్లాట్ ధరలూ పెరిగాయి. నిన్నా మొన్నటి దాకా ₹ 35 లక్షలు పలికిన డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ధర ఇప్పుడు ₹ 60లక్షలకు చేరింది. ఇక లావాదేవీలూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ రంగంతో చిల్లిగవ్వ లేని ఏపీ ప్రభుత్వ ఖజానాలో కాసుల వర్షం ఖాయమని పరిశీలకులు అంచానా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement