Sunday, November 17, 2024

Andhra Pradesh – అంతు చిక్క‌ని సీమ నాడీ ….ఏక పక్షం కష్టమేన‌ట‌

కలియుగ భూ వైకుంఠం తిరుపతి వేంకటాచలం.. అవని కైలాశం శ్రీశైలం .. సీమకే మకుటం వీరబ్రహ్మేంద్ర స్వామి బైరాగి తత్వం.. ఆధ్యాత్మిక చింతనలో ఎంత ఘనమో, శత్రువు పతనం తప్పని పౌరుషాల గడ్డ జీవగడ్డలో ఆధిపత్య సమరం నెల‌కొంది. విజయమే గానీ.. వీర స్వర్గం ఎరుగుని రాయలసీమ ఎన్నికల కురుక్షేత్రంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న ఏక పక్ష ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో తెర పడుతుందా! లేదా? ఒకరి కంచుకోటలపై మరొకరు దండయాత్ర జరిపితే.. గెలుపు ఎవరిది? మళ్లీ పాత కథే చర్విత చరణమా? కొత్త అధ్యాయం పురుడు పోసుకుంటుందా? ఈ పశ్నలపైనే ఏపీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.


ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయలసీమలో చిరకాల కాంగ్రెస్ పాలనకు బ్రేక్ ప‌డినప్పటికీ.. 2004 ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోసుకుంది. అదీ వైఎస్ రాజ‌శేఖరరెడ్డి సారథ్యంలోనే సాధ్యమైంది. ఇక ఆయన అకాల మ‌ర‌ణంతో వైసీపీని రాయలసీమ అక్కున చేర్చుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఉనికి తప్పా .. మనుగడ లేని స్థితిని వ‌చ్చింది. అయితే.. ఈసారి ఎన్నిక‌ల రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. ఇటు రాజు కోటను అటు రాజు… అటు రాజు కోటను ఇటు రాజు ధ్వంసం చేసే వ్యూహాలతో బలగాలను మోహరిస్తున్నారు. పథకాలు రచిస్తున్నారు. అమలుకు అప్పుడే సేనానులను రంగంలోకి దించారు. ఈ కురుక్షేత్రంలో కుటుంబ కుంపటి కూడా తోడు అయ్యింది. దీంతో రాయల సీమలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అంద‌రినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

- Advertisement -

వైఎస్సార్ సార‌థ్యంలో..

వైఎస్సార్ జ‌మానాలో రాయలసీమ కాంగ్రెస్ రాజ్యంగా మారిపోయింది. అభివృద్ధిలోనూ పునాదులు పడ్డాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 38 అసెంబ్లీ స్థానాలు దక్కితే .. తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు లభించాయి. కడప, కర్నూలు జిల్లాల్లో కేవలం మూడు సీట్లల్లో తెలుగుదేశం గెలిచింది. ఇక 2009లో కాంగ్రెస్ గాలి తగ్గింది. కానీ, పీఆర్పీ పోటుతో టీడీపీ చాన్సు కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం 32 స్థానాలకు పడిపోగా.. టీడీపీ మరో అయిదు స్థానాలను కైవసం చేసుకుని 19 స్థానాలకు చేరుకుంది. పీఆర్పీ మూడు స్థానాల్లో విజయ భావుటా ఎగురవేసింది. పీఆర్పీ బలం, అటు రాష్ట్ర విభజన హెచ్చరికతో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ నిలదొక్కుకుంది. దీనికితోడు అంతర్గత కుమ్ములాటలూ టీడీపీని కుంగదీశాయి. ప్రజావ్యతిరేక బలం ఎంతపెరిగినా.. వైఎస్సార్ పాచికలు పనిచేశాయి.

వైఎస్సార్ మ‌ర‌ణంతో..

వైఎస్సార్ మ‌రణంతో రాయల సీమ తల్లడిల్లింది. ఆయన వారసత్వానికే మొగ్గు చూపింది. రాష్ట‌ర విభజనతో కుమిలిపోయింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోయింది. వైఎస్సార్ త‌నయుడు జ‌గ‌న్‌కు పట్టంకట్టాల సీమ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆయన స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ పార్టీలో యువతరం నేతలంతా వైసీపీలోకి వచ్చారు. సీనియ‌ర్ నాయ‌కులు అంత‌గా శ్ర‌ద్ధ చూప‌లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీకి 29 స్థానాలు, టీడీపీకి 22 స్థానాలు లభించాయి. మరో స్థానం ఇతరులకు దక్కింది. టీడీపీకి మరింత బలం పెరగలేదు. 19 స్థానాల నుంచి 22 స్థానాలకు పెరిగిందంతే.. అంటే ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మాత్రమే టీడీపీకి మద్దతు లభించింది.

ఓటింగ్‌లో క‌నిపించ‌ని మార్పు..

రాయలసీమలో వైఎస్సార్ అనుకూల ఓటింగ్‌లో ఏ మార్పు కనపడ లేదు. కానీ, వైసీపీకి అధికార యోగం లభించలేదు. 2019 నాటికి ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. బీజేపీ ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసిందనే భావన పెరిగిపోయింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించటంతో … టీడీపీకి ప్రత్యామ్నయంగా వైసీపీకే పట్టం కట్టారు. రాయలసీమలో ఏకంగా 49స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ తుడుచిపెట్టుకుపోయింది. అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరు జిల్లాలో ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.

ఏకఛ‌త్రాధిపత్యం కష్టమే…

రాయలసీమ నాలుగు జిల్లాల్లో వైసీపీ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుందా? లేదా? అనే అంశాలు ప్రస్తుతం తెరమీదకు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాల్లో ఈ సారి ఆధిపత్యం దెబ్బతింటుందా? పురిటిగడ్డ కడపలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? లేక ఇవ్వన్నీ పుకార్లా? అనంతపురంలో ఎంత యత్నించినా.. టీడీపీ తన స్థితిని, గతిని మార్చుకోగల సత్తా ప్రదర్శిస్తోంది. ఫ్యాన్ గాలిలోనూ.. వైఎస్సార్ తుపానులోనూ అనంతపురం జిల్లాలో టీడీపీ ప్రతిఘటన కనిపించింది. మరి ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ జట్టుతో అనంతపురం జిల్లాలో టీడీపీ తన సత్తా చాటుతుందా చూడాల‌ని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

క‌ర్నూలు, చిత్తూరు కాస్త డిఫ‌రెంట్‌..

కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాని స్థితి. ఒకటి నిజం … రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార పార్టీ తన సహజ బలంపై నమ్మకం పెట్టుకున్నా.. ప్రతిపక్ష కూటమి ప్రతిఘటనతో రాయలసీమలో ఏం జరుగుతోంది, ఏం జరుగబోతోందో.. రాజకీయ పరిశీలకులు అంచనా వేయలేక పోతున్నారు. కడపలో జ‌గ‌న్ బ‌లాన్ని బలహీన పర్చటానికి టీడీపీ వ్యూహం రచిస్తే.. కుప్పంలో చంద్రబాబును ఓడించటానికి వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఇక కడపలో వైఎస్సార్ త‌నయ షర్మిల, సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డి మధ్య పోటీ నెల‌కొంది. దీంతో కడప రాజకీయాలపై ఏపీ ప్రజల్లో టెన్ష‌న్ రేగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో అటు అధికార పక్షంలోనూ.. ఇటు ప్రతిపక్షంలోనూ నెల‌కొన్న అంతర్గత కుమ్ములాటలు ఇరు పక్షాలకు లాభం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement