Friday, November 22, 2024

ఎగుమతుల్లో రాష్ట్రానికి 9వ స్థానం.. గతంతో పోలిస్తే 11స్థానాలు పైకి

అమరావతి, ఆంధ్రప్రభ: ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయి. దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాలన్నది లక్ష్యం కాగా ఎగుమతుల సంసిద్ధత సూచీలో మెరుగైన ఫలితాలు సాధించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ లోని జిల్లాల వారీ స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తూ బ్రాండ్‌ సృష్టించడమే కాకుండా ర్యాంకింగ్స్‌ లోనూ సత్తా చాటింది. ఏపీ నుంచి ఎగుమతులు ఏడాదికేడాది వృద్ధిలో సాగుతున్నాయి. 2030 కల్లా రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సూచనల మేరకు సబంధిత అధికారులు అనేక చర్యలు చేపట్టారు.

9వ స్థానం.

ఎగుమతుల సంసిద్ధత సూచీలో ఏపీ 9వ స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ 50.39 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఎగుమతుల సంసిద్ధత సూచీ-2021లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 11 స్థానాలు పైకి ఎగబాకిందని కరికాల పేర్కొన్నారు. ఎగుమతుల వాతావరణంలో 10వ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య వాతావరణంలో 8వ స్థానం దక్కించుకుందన్నారు. పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ తన ర్యాంకును మెరుగుపరచుకున్నట్లు- ఆయన తెలిపారు. మొత్తం దేశ ఎగుమతుల్లో 78.86 పాయింట్లతో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, 77.14 పాయింట్లతో మహారాష్ట్ర రెండో స్థానం -కై-వసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో 61.72 పాయింట్లతో కర్ణాటక, 56.84 పాయింట్లతో తమిళనాడు.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 5,6,7,8 స్థానాల్లో నిలిచిన హర్యాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ ల పాయింట్లను ఏపీ సాధించిన పాయింట్లతో పోలిస్తే కేవలం 1-2శాతం మాత్రమే వ్యత్యాసం ఉండడం గమనార్హం.

జగన్‌ పనితీరుకు నిదర్శనం: మంత్రి బుగ్గున..

తి ఆయోగ్‌ ప్రకటించిన ఎగుమతుల సంసిద్ధత సూచీ-2021లో పనితీరు అంశంలో ఏపీ ద్వితీయ స్థానం దక్కించుకోవడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు పరిశ్రమల శాఖ కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎగుమతుల సంసిద్ధత సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 11 స్థానాలు ఎగబాకడం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దార్శనికతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement