అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండోరోజుకు చేరుకుంది. తొలిరోజు రాత్రి వరకు గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్లను పంపిణీ చేశారు అధికారులు. మొత్తం 26 లక్షలకు పైగా లబ్ధిదారులకు మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ చేతికి అందింది. ఈనెల ఆరు వరకు పెన్షన్ల ప్రక్రియ కొనసాగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి 19 వందల 51 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. రెండోరోజు మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియ జరగనుంది. అయితే తొలిరోజు ఇద్దరు వృద్దులు మరణించడం, చాలా చోట్ల పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడటంతో అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు గ్రామ సచివాలయ సిబ్బంది.
తొలి రోజు గందరగోళం..
అయితే తొలిరోజు పెన్షన్ పంపిణీ ప్రక్రియ లబ్ధిదారుల్లో ఆందోళన కలిగించింది. ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా గ్రామ సచివాలయాల దగ్గరే పెన్షన్ల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అందరూ గ్రామ సచివాలయాలకు క్యూ కట్టారు. కానీ ఉదయం నుంచే ప్రారంభించాల్సిన పంపిణీ ప్రక్రియ సాయంత్రం అయినా మొదలుపెట్టలేదు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు. నిధులు లేవని సిబ్బంది చేతులెత్తేయడంతో డబ్బులు వచ్చేదాకా సచివాలయాల దగ్గరే పడిగాపులు కాశారు.
వేసవి తాపానికి ఇద్దరు మృతి..
ఎన్నికల సంఘం ఆంక్షలతో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరమయ్యారు. దీంతో గ్రామ సచివాలయాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఒక్కసారిగా సచివాలయాలకు భారీగా పింఛన్ దారులు తరలిరావడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో, పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలువురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వేసవి తాపానికి అస్వస్థతకు గురై ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.
పింఛన్ లపై పార్టీల రగడ ..
ఓ వైపు లబ్ధిదారుల్లో పెన్షన్ టెన్షన్ నెలకొన్న వేళ.. మరోవైపు రాజకీయ రగడ రాజుకుంది. ఇద్దరు వృద్ధులు మృతి చెందడం, లబ్ధిదారులు పడిగాపులు కాయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి తెరతీశారు. వాలంటీర్లు లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈసీ ఆంక్షలు విధించేందుకు ప్రతిపక్ష పార్టీలే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే ఈ విమర్శలకు ప్రతిపక్ష నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా అధికార వైసీపీ ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఈసీ ఆంక్షలను ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడం తగదని సూచిస్తున్నారు. సినిమా రిలీజ్‌లకు రెవెన్యూ ఉద్యోగులను వినియోగించిన ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ఉపయోగించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల మృతి ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు.