Friday, November 22, 2024

Andhra Pradesh – ఐఆర్ లేదు.. ఏకంగా పీఆర్సీ! బొత్స

ప్రభుత్వం రివర్స్
జులై 31కి పీఆర్సీ ప్రకటిస్తాం
ఇంకా మధ్యంతర భృతి దేనికీ?
మంత్రుల కమిటీ ఎదురు ప్రశ్న
ఎన్నికల కోడ్ కు ముందే బకాయిలు చెల్లించాలి
27న ఆందోళనకే ఉద్యోగులు సిద్ధం

(ఆంధ్రప్రభ , అమరావతి) జులై 31 నాటికి పీఆర్సీని అమలు చేస్తామని, ఇక మధ్యంతర భృతితో పని లేదని మంత్రుల కమిటీ తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన ఆందోళనకే సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం జరిగిన మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు.. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అక్కడ ఏం జరిగిందో వివరించారు.

ఫ‌ల‌వంతం కాని చ‌ర్చ‌లు..

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల తో మంత్రుల కమిటీ చర్చలు ఫలవంతం కాలేదని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు మధ్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ , గత పీఆర్సీ బకాయిలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులు పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు.వాస్తవానికి పీఆర్సీ బకాయిలే రూ.14,800 కోట్లు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు వెల్లడించారు. వీటిని ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారన్నారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందన్నారు. 12వ పీఆర్సీనీ జూలై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని ఆయన తెలిపారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారన్నారు, ఉద్యోగుల డిమాండ్ ల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందని బొప్పరాజు వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 27న ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం

- Advertisement -

బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్‌ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు. ఈసమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారి చైతన్య, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement