Friday, November 22, 2024

Andhra Pradesh – కూటమి కొత్త‌ పోకడ – బాబు సరికొత్త ఎత్తుగడ

అనపర్తిలో కాషాయ కండువాలో పసుపు నేత
బీమవరం జనసేన శిబిరంలో తెలుగు తమ్ముడు
రాయలసీమలో కమల దండుకు
టీడీపీ శ్రేణుల నమస్కారాలు
ఆరు లోక్‌స‌భ స్థానాల్లో ఇదే సీన్‌
కాషాయంతో జ‌త‌క‌ల‌వ‌లేకపోతున్న‌ త‌మ్ముళ్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి :

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయం ఖాయమని అంచనాల మీద అంచనాలు ఉరుకులు పరుగులు పెడుతుంటే… క్షేత్ర స్థాయిలో మందగమనం వెక్కిరిస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీ ఉనికే అంతమాత్రమే. కేడర్ కూడా అతి స్వల్పమే. దగ్గుబాటి పురందేశ్వరీ నాయకత్వంతో కాస్త ప్రచారం పెరిగిందే గానీ.. పోల్ మేనేజిమెంట్‌లో పూర్తిగా టీడీపీపైనే ఆధారపడక తప్పలేదు. ఇక్కడే తెలుగుతమ్ముళ్లు కాషాయ పార్టీతో జత కలవలేక.. ముందుకు వెళ్లలేక చతికిలపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఆరు లోక్‌స‌భ‌ స్థానాల్లో ఎన్ని గెలుస్తారో అంచనా లేదు. 10 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే స్థితి. టీడీపీ నాయకుల్నే.. అటు జనసేన కండువాతో, ఇటు బీజేపీ కండువాతో బరిలోకి దించటంతో.. క్షేత్రస్థాయిలో ఇరుకున పడినట్టు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో తమ వెంట రావొద్దని పసుపు సైనికులు కమల దండుకు నమస్కారం చేస్తున్నాయి. జమ్మల మడుగు, బద్వేలు, ధర్మపురి నియోజకవర్గాల్లో ఆయాచితంగా తమ సీట్లు కొట్టేశారని టీడీపీ శ్రేణులు గొల్లు మంటుంటే.. కోస్తాలో ఏకంగా బీజేపీలోకి పంపించటంతో అనపర్తిలో టీడీపీ కేడర్ చిన్నబోయింది. తమ నాయకుడు బీజేపీలోకి చేరటాన్ని తట్టుకోలేక పోతున్నారు. పవన్ కళ్యాణ్ త్యాగంతో భీమవరం సీటును టీడీపీ భుజాన జనసేన కండువ కప్పటంతో.. జనసేనలోనూ పైకి కనిపించని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపికలో కూటమి సరికొత్త పోకడ, ఎత్తుగడ ఏ ఫలితానికి దారి తీస్తుందో? వేచి చూడాల్సిందే.

- Advertisement -

అనపర్తిలో రామ రామ …!

అనపర్తి సీటును బీజేపీకి త్యాగం చేయటం ఒక ఎత్తు కాగా.. టీడీపీ నేతను కమలనాథుడిగా మార్చటం మరోక ఎత్తుగడ. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం, ప్రతివ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో అర్థం కాని స్థితి. అనపర్తిలో 2014లో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్థిగా 1,373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి 55,207 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రేలంగి నాగేశ్వరరావు 11,769 ఓట్లు చీల్చటంతో రామకృష్ఱా రెడ్డికి 55,564 ఓట్లే లభించాయి. సూర్యనారాయణ రెడ్డికి 1,11,771 ఓట్లు వచ్చాయి. ఈ సీటును బీజేపీ అడిగింది. ఇక బీజేపీ అభ్యర్థి హరినారాయణ రెడ్డికి కేవలం 627 ఓట్లు వచ్చాయి. నోటాకు 2114 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ కంటే మూడు రెట్ల ఓట్లు నోటాకు పడ్డాయి. ఇలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థి మళ్లీ గెలుస్తాడో లేదో? అనే అనుమానంతోనే ..ఈ సీటును బీజేపీకి అప్పగించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డిని బీజేపీకి సాగనంపటం వెనుక రాజకీయ ఎత్తుగడ ఎవ్వరికీ అర్థం కావటం లేదు. తెలుగుదేశం కార్యకర్తలు సైకిల్ గుర్తుకు కాకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తారా? ఇంతకీ ఓటు బదిలీ జరుగుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ స్థితిలోనే రామకృష్ణా రెడ్డి పోటీ చేయాలా? వద్దా అనే మీమాంశలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.

భీమవరంలో..త్యాగం ఫలించేనా?

ఓడిన చోటే గెలవాలనే ధ్యేయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేస్తారని అందరూ భావించారు. అక్కడ తెలుగుదేశం నాయకుడు పులపర్తి రామాంజనేయులు త్యాగం చేయక తప్పదని భావిస్తే.. ఇక్కడ త్యాగం ఎదురు తిరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు ఎక్కువ మక్కువ చూపించారు. అంతే రామాంజనేయులును జనసేన శిబిరానికి టీడీపీ అధిష్టానం సాగనంపింది. ఇక్కడ డీడీపీ శ్రేణుల్లోనూ కాస్త మనస్థాపం తప్పలేదు. జనసేనలోనూ తమ నాయకుడిని కోల్పోయామనే వ్యథ తప్పలేదు. ఐతే, 2019 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు 62 వేల ఓట్లు, రామాంజనేయులుకు 54 వేల ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్ ఇమేజీతోనే 62 వేల ఓట్లు రాగా.. ఈ సారి ఆయనకు బదులుగా అంత ఇమేజీ రామాంజనేయులుకు దక్కుతుందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement