ఎపిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటునకు ఎన్టీఎ కూటమి నేత చంద్రబాబు ను ఆహ్వానించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కోరారు. నేడు రాజ్ భవన్ లో గవర్నర్ ను నేడు టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కలిశారు.
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు ఆయనకు వివరించారు.. ఈ మేరకు గవర్నర్ కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు.
అనంతరం రాజ్ భవన్ వెలుపల అచ్చెన్నాయుడు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారన్నారు.