Tuesday, November 26, 2024

Andhra Pradesh – అన‌కాప‌ల్లి లోక్ స‌భ వైసిపి అభ్య‌ర్ధిగా ముత్యాల నాయుడు

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడింది. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు పేరు ఖరారైంది. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న ముత్యాల నాయుడికే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ. ఆయన కుమార్తె అనురాధ ప్రస్తుతం మాడుగుల అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్నారు.

ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆ సీటును బీసీ అభ్యర్థికే ప్రకటిస్తామని చెప్పింది. తాజాగా ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. బీజేపీ తరుపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన సీఎం రమేశ్ ఉన్నారు.

అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో వైసీపీ చాలా ఈక్వేషన్లను పరిగణలోకి తీసుకుంది. బూడి ముత్యాల నాయుడు వైసీపీకి, వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందారు. అలాగే వరుస విజయాలు నమోదు చేశారు. అధికారం కోల్పోయిన 2014లో, 2019లో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. మరోసారి మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నారు. అయితే, వ్యూహం మార్చిన వైసీపీ.. బూడి ముత్యాల నాయుడిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించనుంది. ముత్యాల నాయుడు సర్పంచ్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడిని వైసీపీ ప్రకటించడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాపు సామాజికవర్గం తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్నది వెలమ సామాజికవర్గం వారే. అందుకనే బీసీ కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం. అటు బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ కూడా వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. ఆయన ఓసీ వెలమకు చెందుతారు.

అందుకని ఆయనపై బలమైన అభ్యర్థిగా బీసీ వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు జగన్. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో వెలమ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు మూడున్నర లక్షల మందికిపైగా ఉన్నారు. ఆ ఓట్లన్నీ తమకే పడాలంటే.. ముత్యాల నాయుడు లాంటి కాంట్రవర్సీ లేని అభ్యర్థి అయితే అన్ని విధాలుగా కరెక్ట్ గా ఉంటుందని వైసీపీ భావించింది. రెండో అంశం.. పార్టీకి వీర విధేయుడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారు. ప్రలోభాలకు లొంగకుండా వైసీపీలోనే కొనసాగారు. దాంతో సీఎం జగన్ ఆయనను మొదటి నుంచి గౌరవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్యాల నాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. అంతేకాదు ముత్యాల నాయుడు కూతురు అర్లి అనురాధకు మాడుగల టికెట్ ఇవ్వడం మరో విశేషం. అనురాధ ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఒకే పార్లమెంటు పరిధిలో తండ్రి, కూతురు ఇద్దరూ ఎన్నిలక బరిలోకి దిగుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement