కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రగుంట్ల మండలం నీటి చూపి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ పోలీస్ బలగాల మొహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆది నారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీస్ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కాగా, జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల దగ్గర సైతం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉంది.
రంగంలోకి ఎస్పీ సిద్దార్ధ కౌశల్..
అయితే, జమ్మలమడుగులో కవ్వింపు చర్యలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్ అయ్యారు. జమ్మలమడుగులో మఖం వేసిన ఎస్పీ.. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ గన్మెన్ సౌకర్యం కల్పించారు.. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ గన్మెన్ లను కేటాయించారు. నేతలను వారి వారి గ్రామాలకే పోలీసులు పరిమితం చేశారు.