Sunday, November 17, 2024

Andhra Pradesh – రిజల్ట్‌ పై హై టెన్షన్ .. క్షణం క్షణం ఉత్కంఠ

గోదారి ఒడ్డునే తొలి సందడి
కొవ్వూరు, నరసాపురంలో ఫస్ట్​ రిజల్ట్​
భీమిలి, చంద్రగిరిలో ఫుల్ హీట్‌
25 రౌండ్ల లెక్కింపు.. రాత్రికి కానీ కొలిక్కి
మధ్యాహ్నం వేళకే 111 సెగ్మెంట్ల ఫలితం​
60 నియోజవర్గాల్లో మాత్రం సాయంత్రానికి
గెలుపు, ఓటములపై పెద్ద ఎత్తున చర్చ
ఐపీఎల్​ స్థాయిలో కొనసాగుతున్న బెట్టింగులు
ఏపీ, తెలంగాణ, అమెరికాలోనూ ఇదే లొల్లి

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భ‌ద్రంగా ఉన్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ సారి ఓట్ల లెక్కింపు సైతం అలజడి సృష్టించనుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోఅర్థం కాని స్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియపైనే జనంలో టెన్ష‌న్ నెల‌కొంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ చావోరేవోకు సర్వసన్నద్ధమైంది. ఎన్నికల కమిషన్ కూడా అన్నిటికీ రెడీ అయ్యింది.. తన బలగాలను సిద్ధం చేసింది. అధికార , ప్రతిపక్ష పార్టీల్లో విజేతలెవరు? అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. పనిలో పనిగా ఐపీఎల్‌ను మించిన బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. ఏపీలో 2024 ఎన్నికల ఖర్చు ₹21,000 కోట్లకు చేరుకోగా.. ఫలితాలపై తెలంగాణ, ఏపీలోనే కాదు.. అమెరికాలోనూ బెట్టింగ్​లు షురూ అయ్యాయి. అనధికార సమాచారం మేరకు ₹10వేల కోట్ల మేరకు బెట్టింగులు జరిగినట్టు అంచనా. ఈ ఎన్నికల ఫలితాల్లో బెట్టింగ్​లతో ఎంత మంది లబ్ధిపొందుతారో, మరెంతమంది బికారులుగా మారుతారో జూన్ 4న మధ్యాహ్నం వేళకి తేలిపోనుంది.

- Advertisement -

క్షణక్షణం ఉత్కంఠ..

ఓట్ల లెక్కింపు ఏ విధంగా సాగుతుంది?.. ఏ సమయానికి పూర్తి ట్రెండ్ అర్థమవుతుంది?.. ఏ నియోజకవర్గం ఫలితం ముందుగా వస్తుంది?.. ఆఖరుగా ఏ నియోజకవర్గం ఫలితాలు వస్తాయి?.. అనే అంశాలపై ఏపీ జనంలో చర్చ జోరుగా సాగుతోంది. పోలైన ఓట్లు.. కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్​లను నిర్ధారించింది.

గోదారి ఒడ్డునే తొలి సందడి..

ఏపీలోని తొలి ఎన్నికల ఫలితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వెల్లడి కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో అధికారపార్టీ వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి అరిగెల లక్ష్మీ పోటీ పడ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు నువ్వానేనా అనే రీతిలో ప్రచారంలోనూ.. పోల్ మేనేజ్ మెంట్లోనూ దూసుకు పోయారు. కానీ, వీరిద్దరి గెలుపు ఓటములపై కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిపై ప్రభావం చూపారో? అనే అంశంపైనా బెట్టింగులు కొనసాగటం విశేషం.

భీమిలి, చంద్రగిరిలో హైటెన్షన్

పాణ్యం, భీమిలి, రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. పాణ్యం, భీమిలి సెగ్మెంట్లలో 25 రౌండ్లు లెక్కింపు జరగనుంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీ పడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పట్టికీ.. వీరిద్దరి మధ్య నువ్వనేనా అనే రీతిలో పోటీ సాగింది. ఇక చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీలో దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్​కు ముందే ఇక్కడి డీఎస్సీపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ స్థితిలో భీమిలి, చంద్రగిరిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక.. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో చివరి ఫలితాలు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల కోసం రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

మద్యాహ్నానికే 111 అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు

175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్ల లోపే లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం రెండు గంటల్లోగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గ ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. 29 రౌండ్ల లెక్కింపు జరిగే రెండు నియోజకవర్గాల ఫలితాలను రాత్రి 7 గంటల నుంచి 9గంటల సమయంలో వెల్లడిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement