Saturday, November 23, 2024

ఖరీఫ్‌లో పంటకు రుణ పరిమితి కుదింపు

అమరావతి, ఆంధ్రప్రభ:ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు అందిస్తున్న స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ (రుణ పరిమితి)ని తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లా యూనిట్‌గా రుణ పరిమితిని నిర్ణయించిన బ్యాంకర్లు, ఇక నుంచి రాష్ట్రం యూనిట్‌గా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) ఈ మేరకు ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏయే పంటలకు ఎంత మేర రుణం అందించాలో ఒక డ్రాప్ట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఎస్‌ఎల్‌బిసి ఆమోదం తెలిపిన వెంటనే బ్యాంకర్లు వీటిని అమలు చేయనున్నారు. 2022 ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట 40.34 లక్షల ఎకరాలు, వేరుశనగ 18.40 లక్షలు, పత్తి 14.82 లక్షలు, చెరకు 3.71 లక్షలు, మొక్కజొన్న 2.72 లక్షల ఎకరాలు, పప్పుధాన్యాలు 6.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రభుత్వం ఖరీఫ్‌ వ్యవసాయ ప్రణాళికలో పేర్కొంది. పంట రుణాల కింద ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.93,687 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కో-ఆర్డినేషన్‌ కమిటీ నిర్ణయించింది. అయితే ఆయా పంటలకు అందివ్వనున్న రుణ పరిమితిపై మాత్రం కోత పెట్టింది.

సున్నా వడ్డీ చెల్లింపులోనూ మార్పు..

వ్యవసాయ రుణాలపై బ్యాంకులు ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. సకాలంలో చెల్లించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ రాయితీ అందిస్తోంది. ఈ ఏడాది నుంచి రాయితీ డబ్బుల చెల్లింపులోనూ మార్పులు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు శాతం రాయితీని ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే చెల్లించేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వడ్డీ రాయితీ సొమ్ము మాత్రం ఖరీఫ్‌ ముగిసిన తర్వాత అక్టోబర్‌లో చెల్లించనున్నారు. రైతులు ఏ పంట కోసం రుణం తీసుకున్నారో, క్షేత్ర స్థాయిలో ఆ పంట ఉంటేనే రాయితీ వర్తింపజేయనున్నారు

పెరుగుతున్న ఖర్చులు…తగ్గిన రుణం..

పంట సాగు ఖర్చులు ఏడాదికేడాది పెరుగు తున్న నేపథ్యంలో రుణ పరిమితిపై కోత విధించడం పై రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వ్యవసాయ ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లాలో ఎకరా వరికి రూ.20 వేలు ఖర్చయితే ప్రస్తుతం ట్రాక్టర్ల అద్దెలు, ఇతర ఖర్చులు కలిపి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ తగ్గించడంతో అన్నదాతలు మరింత అప్పులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహ రణకు ఎకరాకు రూ.43,200 చొప్పున ఐదు ఎకరాలకు బ్యాంకు నుంచి గతంలో రూ.2,17,500 పొందిన రైతుకు ప్రస్తుతం రూ.1,70,000 (ఎకరాకు రూ.34వేలు) మాత్రమే రుణం అందుతుంది. రుణాన్ని రెన్యువల్‌ చేయించుకో వాలంటే వీటి మధ్య వ్యత్యాసం రూ.47,500లను తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అప్పు కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదలతో పాటు ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement