అమలాపురం – వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కుట్రతో కూడినదని ఆయన వ్యాఖానించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులు లేరా అని ప్రశ్నించారు.
నేను రాజన్న బిడ్డని, నేను హైదరాబాద్‌లో పుట్టాను హైదరాబాద్‌లో చదువుకున్నాను, హైదరాబాద్‌లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్‌గా చెప్పిన షర్మిలకు పార్టీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉన్నా, కానీ కాంగ్రెస్‌కి బేషరతుగా సపోర్ట్ చేయడం సంతోషమన్నారు. షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వటం కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఆమోదించలేదని తెలిపారు.
విధి లేని పరిస్థితిలో షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ బిడ్డ అన్న వైఎస్ షర్మిలను ఆంధ్రాలో నాయకత్వం బాధ్యతలు చేపడితే బూడిదలో పూసిన పన్నీర్ అవుతాయని ఆరోపించారు. తెలంగాణలో లీడర్‌షిప్ కావాలనుకున్న షర్మిలను తీసుకువచ్చి పెడితే ఆంధ్ర వాళ్లకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని అన్నారు. తెలంగాణ నాయకులకే లీడర్షిప్ ఇస్తారా అని కాంగ్రెస్‌ను కచ్చితంగా ప్రశ్నిస్తారని అన్నారు.
పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య పోటీ కనపడలేదన్నారు. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయినట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం ఎందుకు పడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో ఏం మాట్లాడాలి ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగా ఉండాలి, అక్కడ నుంచి ఏమి హామీలు తీసుకోవాలి ట్రైనింగ్ ఇచ్చి జగన్ పంపించారని ఆయన ఆరోపణలు చేశారు. నేను మోడీని చూసుకుంటాను నువ్వు సోనియాను చూసుకో.. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్‌గా ఉంటామనే ఉద్దేశం తప్పితే ఇంకోటి కనబడడం లేదని అన్నారు.