సీనియర్ క్రికెటర్ హనుమ విహారీని తిరిగి ఎపికి తిరిగి రావాలసిందిగా ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్.. నేడు హనుమవిహారి లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా తన టిట్టర్ వేదిక ద్వారా తెలిపారు. ఇక బేటీ సందర్బంగా జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
దీంతో.. తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ.. తన టాలెంటును గత ప్రభుత్వం తొక్కేసిందని ఆరోపించారు. ఓ వైసీపీ కార్పోరేటర్ పేరు చెప్పి తనతో బలవంతంగా రిజైన్ చేయించారని హనుమ విహారి ఆరోపించారు. ఈ క్రమంలో.. చంద్రబాబు, లోకేష్ పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు తనను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అప్పటి ఏసీఏ వ్యవహరించిన తీరుతో వేరే రాష్ట్రం నుంచి ఆడాలని భావించానని ఏసీఏ నుంచి ఎన్వోసీ తీసుకుని వేరే రాష్ట్రం తరపున ఆడేందుకు ప్రయత్నించానని చెప్పారు.
మరోవైపు ఆంధ్రాలో క్రికెట్ను ఎంకరేజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని విహారి తెలిపారు. అంతేకాకుండా ఏసీఏ తరపునే ఆడాలని లోకేష్ సూచించారన్నారు. క్రీడల్లో రాజకీయాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని, లోకేష్ హామీతో తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెటర్ హనుమ విహారి పేర్కొన్నారు.