యువత భవితను మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐ.టీ దిగ్గజ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’తో ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కోరినట్లు 1,62,000వేల మంది యువతకు శిక్షణ, ధృవపత్రాల అందజేతకు ‘మైక్రోసాఫ్ట్’ అంగీకారం తెలిపింది. ఏపీలో ఉపాధి అవకాశాల పెంపులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విద్యా శాఖ కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థతో కీలక భాగస్వామ్యం అయ్యింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ‘మైక్రోసాఫ్ట్’తో ఎంవోయూ చేసుకోనుంది. నెల్లూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి గౌతమ్ రెడ్డి హాజరు కానున్నారు.
2019లో ప్రభుత్వం ఏర్పడగానే కోవిడ్ సవాల్ విసిరిందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ రాష్ట్రం ధీటుగా ఎదుర్కొందని తెలిపారు. కోవిడ్ పై త్వరగా అవగాహన పెంచుకుని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ దార్శనికతతో అడుగులు వేశారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ‘డిజిటల్ కనెక్ట్’ చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని చెప్పారు. రాబోయే 3 ఏళ్ళలో 80 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్ట్ చేయడమే లక్ష్యం అని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో అతి పెద్ద సవాలైన ‘రిమోట్ లెర్నింగ్’ మెరుగుపరచడానికి ప్రత్యేకంగా దృష్టి సారించామని మంత్రి వివరించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సహా అనేక పరిస్థితులను బట్టి పరిణామాలు, అవసరాలు మారాయి అని పేర్కొన్నారు. నాలుగేళ్ల కోర్సులను కట్ షాట్ లో ఏడాదికి కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
నైపుణ్యం, నేర్చుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టెక్నాలజీ అనేది వారధి లాంటిది, టెక్నాలజీ పాత్ర ఎల్లలు లేనిదని అన్నారు. రాబోయే ఏడాదిలో కోటి 30 లక్షల మందికి కంప్యూటర్ల, ల్యాప్ టాప్ ల వంటి వసతులను సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ టెక్నాలజీ అప్ గ్రేడింగ్ కు పెద్దపీట వేసినట్లు చెప్పారు. శిక్షకులకు, ఉపాధ్యాయులకు మారుతున్న విద్య, ఉపాధి అవసరాలు, అవకాశాలను బట్టి ఎప్పటికప్పుడు శిక్షణ, పున:శిక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులను పాఠశాల దశ నుంచే భవిష్యత్ లో ఉద్యోగం పొందే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక ఉందన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేలా, అందరి ఆశయాలు నెరవేర్చేలా, ప్రతి నైపుణ్యం,విద్య కలిగిన వ్యక్తి ఉద్యోగం పొందాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. కోవిడ్ సమయంలో సుమారు 2 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ లో యువతకు నైపుణ్య శిక్షణ అందించగలిగామని వివరించారు. విద్యాశాఖ , నైపుణ్య శాఖ ఏకతాటిపైకి వచ్చి నవతరం భవిష్యత్ నిర్మించబోతున్నాయని అభిప్రాయపడ్డారు. రెండేళ్ళ కాలంలో లెక్కలేనన్ని మంచి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఆవశ్యకతను గుర్తించి ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.