పోలింగ్ తర్వాత సైలెంట్ మూడ్‌లో లీడర్లు
అలసి, సొలసి విదేశాలకు వెళ్లిన ఆ ముగ్గురు
అమెరికా టూర్‌లో చంద్రబాబు, షర్మిల
లండన్ పర్యటనలో వైఎస్ జగన్
విశాంత్రి తీసుకుంటున్న పవన్, పురందేశ్వరి
ఒక్కొక్కరు తిరుగు ప్రయాణం..
జూన్ ఒకటో తేదీ నాటికి అంతా ఏపీకి రాక
నేడు హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత బాబు
ఏపీలో పొలింగ్ అనంతరం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిన అన్ని పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తున్నారు. 40 రోజులు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు.. పోలింగ్ ముగియగానే పలు ప్రాంతాలకు వెళ్లారు. జూన్ 4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఆయా నేతలంతా తిరిగి వచ్చేస్తున్నారు.
లండన్ టూర్‌లో ఏపీ సీఎం
సుదీర్ఘంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం.. వీటన్నింటి నిర్వహించి మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సీఎం జగన్.. మే 13న పోలింగ్ ముగిశాక.. 17న లండన్ పర్యటనకు వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజులు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లిగూడెం వచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలు సైతం జూన్ 1 నాటికి ఏపీకి చేరుకోనున్నారు.
అమెరికా నుంచి వచ్చిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. పోలింగ్ అనంతరం విశ్రాంతి కోసం ఈనెల 19న సతీమణితో కలిసి విదేశాలకు పయనమయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన బాబు దాదాపు పది రోజుల పాటు అక్కడే గడిపారు. ఇక కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్ననేతలు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఆయన రేపటి నుంచి అమరావతిలో ఉండనున్నారు. అక్కడ నుంచే ఎన్నికల ఫలితాలను సమీక్షించనున్నారు..
సినిమా షూటింగ్స్‌లో పవర్ స్టార్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెకేషన్ మూడ్ పూర్తి చేసుకుని సినిమాకు సంబంధించి షూటింగ్ లేదా ట్రైనింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారం. ముంబయిలో ఫైట్ సీన్స్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా షూటింగ్‌ను ముగించుకుని జూన్ 1న అమరావతి చేరుకుంటారు.అక్కడి నుంచే ఫలితాల పరిశీలన చేయనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అమెరికా నుంచి 3న తిరిగి రానున్న షర్మిల
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల అలుపెరగని ప్రచారం చేశారు. పోలింగ్ ముగిసన అనంతరం కుమారుడు ఉంటున్న అమెరికాకు వెళ్లారు.. అక్కడే ఆమె తల్లి విజయమ్మ కూడా ఉంటున్నారు. ఇక వీరిద్దరు కలసి జూన్ 3న స్వదేశానికి తిరిగివస్తున్నారు.
పురందేశ్వరి కూడా..
కమలదళాన్ని ముందుండి నడిపిన ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గబాటి పురందేశ్వరి కూడా పోలింగ్ అనంతరం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి ఆమె ఇతర ప్రాంతాలకు వెళ్లారు. జూన్ ఒకటో తేదీ నాటికి రాజమండ్రికి చేరుకోనున్నారు. ఆమె ఆక్కడి నుంచే లోక్ సభకు పోటీ చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..
ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెకేషన్‌కు వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్లగా, మరికొందరు వేరే రాష్ట్రాలకు, ఇంకొందరు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు వెళ్లారు. వీరంతా జూన్ 1 నాటికి రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉండడం కారణంగావారంతా 1వ తేదీ నాటికి తిరిగి వచ్చేస్తున్నారు.