Tuesday, November 19, 2024

Andhra Pradesh – అలుపెరగని లీడర్లు! మండుటెండలో ప్రచారానికి తెర

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆయా పార్టీల లీడర్లు అలుపెరగని పోరాటం చేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారిలో చైతన్యం కోసం యత్నించారు. 48 డిగ్రీల టెంపరేచర్లను లెక్కచేకకుండా మండుటెండల్లో మస్తు ప్రచారం చేశారు. మరోసారి అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో జగన్.. ఏపీని కాపాడాలనే తాపత్రయంతో చంద్రబాబు, పవన్​ రంగంలోకి దిగారు. ఇక.. అన్న జగన్​ చేసిన అక్రమాలు, అన్యాయాన్ని జనాలకు తెలిసేలా కాంగ్రెస్​ చీఫ్ షర్మిల తనదైన శైలిలో లేఖాస్త్రాలను సంధించారు. ​ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా ప్రచారానికి వస్తే.. కాంగ్రెస్​ తరపున పార్టీ ముఖ్య నేత రాహుల్​ వచ్చారు. ఇలా ఏకబిగిన 57 రోజులపాటు విమర్శలు, ఆరోపణలు, మాటల దాడులకు ఇవ్వాల్టి సాయంత్రంతో తెరపడింది.

ఏపీలో 57 రోజుల ప్ర‌చార పర్వానికి తెర‌
ఎన్నికల షెడ్యూల్​ నుంచి మొదలు
ఒకేసారి జగన్​, చంద్రబాబు ప్రచారం మొదలు
సొంత నియోజవర్గాల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
మేము సిద్ధం అంటూ జగన్​.. ప్రజాగళం పేరుతో బాబు
పులివెందులకు మూడుసార్లు వెళ్లిన జగన్​
కుప్పంలో చంద్రబాబు రెండుసార్లు
ఫిఠాపురంలోనే మకాం వేసిన పవన్​ కళ్యాణ్​
కూటమి తరపున సభలకు వచ్చిన ప్రధాని మోదీ
కడపలో షర్మిల తరపున రాహుల్​ గాంధీ రాక
25 లోక్​సభ స్థానాల్లో 454 మంది పోటీ
175 అసెంబ్లీ స్థానాలకు 2, 387 మంది
అత్యధికంగా తిరుపతి అసెంబ్లీకి 46 మంది
విశాఖ లోక్​సభ బరిలో 33 మంది

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ప్రచార పర్వానికి తెరపడింది. ఇప్ప‌టికే ఏజెన్సీలో ప్ర‌చారానికి నాలుగు గంట‌ల‌కే ప్రచారాన్ని ముగించగా, మిగిలిన ప్రాంతాలలో నేటి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు సాగింది. ఇక.. ఏపీలో మొత్తం 25 లోక్ స‌భ స్థానాల‌కు గాను 454 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి 33 మంది పోటీలో ఉన్నారు. కడప లోక్‌సభకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సహా 14 మంది బరిలో ఉన్నారు. నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. ఇక.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీప‌డుతున్నారు.. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉన్నారు.

షర్మిల తరపున రాహుల్​ ప్రచారం..

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి నేటితో చివరి రోజున ఆయా పార్టీల ప్ర‌ధాన నేత‌లు ప్ర‌చారంలో హోరెత్తించారు. క‌డ‌ప‌లో లోక్ స‌భ‌కు పోటీ చేస్తున్న ష‌ర్మిల కోసం కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ చివ‌రి రోజు పులివెందుల‌, క‌డ‌ప‌లో ప్ర‌చారానికి ఫైన‌ల్ ట‌చ్ ఇచ్చారు.. అలాగే ఇడుపుల‌పాయ‌లో వైఎస్సార్​ ఘాట్ సంద‌ర్శించి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఘ‌న నివాళులర్పించారు.. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చిత్తూరు, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో చివ‌రి విడ‌త‌గా ప్రచారం చేసి ఈ ఘ‌ట్టానికి ముగింపు ఇచ్చారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్నూలు జిల్లా ఆదోనిలో, తిరుప‌తిలో ప్రచారం నిర్వ‌హించారు. కాకినాడ‌లో జ‌న‌సేనాని రోడ్ షో నిర్వ‌హించారు.. జ‌గ‌న్ ఏకంగా పిఠాపురంతో స‌హా మూడు స‌భ‌ల్లో పాల్గొని నేతలు, కార్య‌కర్త‌ల‌లో జోష్ నింపారు.

57 రోజుల పాటు ప్ర‌చారం..

లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 18వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సుదీర్ఘంగా 57 రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, సీఎం జగన్​.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేశారు. ముఖ్యంగా జగన్‌, చంద్రబాబు ఒకేసారి, ఒకేరోజు సొంత నియోజకవర్గాల నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మార్చి 27న పులివెందుల నుంచి జగన్‌, కుప్పం నుంచి చంద్రబాబు ప్రచార పర్వానికి తెరతీశారు. కాగా, వారి సుదీర్ఘ ప్రచార యాత్రలో బస్సు యాత్రలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు, ప్రజాగళం సభలతో పోటాపోటీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వీరితో పాటు పవన్‌ కళ్యాణ్‌, షర్మిల కూడా అన్ని జిల్లాలను చుట్టేశారు.

పులివెందులకు మూడు సార్లు…

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి సీఎం జగన్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అంతకు ముందే సిద్ధం పేరుతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నాలుగు భారీ సభలను నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. మార్చి 27న తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి బస్సు యాత్ర ప్రారంభించి 28 రోజుల పాటు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో పర్యటించారు.

కుప్పంకు.. రెండు సార్లు చంద్రబాబు

అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన చంద్రబాబు.. మార్చి 27వ తేదీన తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలమనేరులో తొలి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ప్రజాగళం పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటనలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు కూటమి నేతలతో కలిసి చిలకలూరిపేట, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి సభల్లో పాల్గొన్నారు. ఇలా.. క్షణం తీరికలేకుండా ప్రచారం చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు సార్లు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

పిఠాపురానికి మూడు సార్లు పవన్‌..

భారీ మెజార్టీతో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పవన్‌ కళ్యాణ్ పిఠాపురంలో మూడు సార్లు పర్యటించారు. అత్యధికంగా 10 రోజులకు పైగా ఆ ప్రాంతంలోనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీచేస్తున్న చోట్ల సభల్లో పాల్గొని అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, చంద్రబాబుతో కలిసి ఆయా జిల్లాల్లో భారీ సభల్లో పాల్గొని కూటమి నేతల్లో ఉత్తేజాన్ని నింపారు.

కూట‌మి త‌రుపున‌ ప్ర‌ధాని…

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి త‌రుపున ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం నిర్వ‌హించారు.. 10 రోజుల వ్య‌వ‌ధిలో మూడు సార్లు ప‌ర్య‌టించారు. 10 స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఇక ప్ర‌చారానికి ఫైన‌ల్ ట‌చ్​గా ఆయ‌న విజ‌య‌వాడలో నిర్వ‌హించిన రోడ్ షో హైలెట్ గా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement