ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:ఏపీలో చంద్రబాబు 4.0 సర్కారు పాలనలో తన మార్కు పాలనకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఉన్నత స్థాయిలో బ్యూరోకాట్ల ప్రక్షాళన జరిగింది. ఐఏఎస్ , ఐపీఎస్ ఆపీసర్ల కేడర్‌లో తమ ప్రభుత్వానికి అనుకూల.. అంకితభావం కార్డుతో తగిన స్థానాలను అప్పగించారు. జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. ఇక అత్యంత కీలకమైన సాధారణ బదిలీలపై చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
13 ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీలపై సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీలో విధి విధానాలను ఖరారు చేయనున్నట్టు సమాచారం. సోమవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ సాధారణ బదిలీలపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారికి..కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్న తీరు కొత్త ప్రభుత్వం గుర్తించింది. అదే విధంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని భావిస్తోంది. అయితే, విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో సాధారణ బదిలీల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే తుది మార్గదర్శకాలు జారీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ప్రభుత్వం ఈ విషయంలో తీసుకొనే తుది నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో కీలకమార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టారు. కీలక పదవుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
అసెంబ్లీ కొలువు తీరింది.
కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం 24న జరగనుంది. అధికార స్థాయిలో ప్రక్షాళనలో కొంత భాగం పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. ఇక జిల్లా స్థాయిలోనూ కసరత్తు ప్రారంభించారు. ఇందు కోసం సాధారణ బదిలీలకు రంగం సిద్దం అవుతోంది.అందుకే ఆచీతూచి ..సాధారణ బదిలీలపై ఇప్పటికే ఉన్నతాధికారుల బదిలీలు చేసిన ప్రభుత్వం…తాజాగా సాధారణ బదిలీల పైన ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జూన్ – జులై నెలల్లో ప్రభుత్వం సాధారణ బదిలీలను చేపడుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటం.. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో కొంత ఆలస్యం అయింది. దీంతో..ఇప్పుడు సాధారణ బదిలీల ద్వారా జిల్లా స్థాయి నంచి మండల స్థాయి వరకు పాలనా వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, బదిలీలు పాత 13 జిల్లాల ప్రాతిపదికన ఉండేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.