Tuesday, November 26, 2024

జీఆర్‌ఎంబీ భేటీకి ఆంధ్రప్రదేశ్ డుమ్మా.. చెప్పా పెట్టకుండా మీటింగ్ ఎగ్గొట్టిన అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు రాకపోవడంతో జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఏపీ సభ్యులు రాకపోవడంతో భేటీని ఛైర్మన్‌ వాయిదా వేశారు. బోర్డు ఛైర్మన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏపీ సభ్యులు గైర్హాజరు కావడంపై తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు సభ్యుల హాజరును ధ్రువీకరించుకున్నాకే సమావేశం నిర్వహించాలని బోర్డు ఛైర్మన్‌ను కోరారు.

కాగా… గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తోన్న ఆరు ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించకుండా అడ్డుపడుతోంది. మరోవైపు ఈ విషయంలో జీఆర్‌ఎంబీ తీరుపైనా తెలంగాణ రాష్ట్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఒక్క పెద్దవాగు మినహా గోదావరి నదిపై తెలుగు రాష్ట్రాల మధ్యన ఉమ్మడి ప్రాజెక్టులు లేవు.ఈ పరిస్థితుల్లో గోదావరిపై తెలంగాన ప్రభుత్వం తన వాటా జలాలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయటంపై తెలంగాణ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఈ విషయాలన్నింటినీ శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో చర్చిద్దామనుకున్న తరుణంలో జీఆర్‌ఎంబీలోని ఏపీ సభ్యులు డుమ్మాకొట్టటం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జీఆర్‌ఎంబీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement