Tuesday, November 26, 2024

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 20 తర్వాత కూడా కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సండలింపులతో కర్ఫ్యూను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి.. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటు.. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని తెలిపారు. అయినప్పటికీ, ఈ నెల 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించారు.

కోవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని సీఎం జగన్ అన్నారు. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని, గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి. ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు.  ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని, 89 శాతం మంది కరోనా బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారని సీఎం జగన్ వివరించారు. ఏపీలో పిల్లల వైద్యం కోసం 3 అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వైజాగ్, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో నెలకొల్పుతామని వివరించారు.

ఇక, కరోనా థర్డ్ వేవ్ వస్తే అందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని వెల్లడించారు. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం చూపే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, జిల్లాస్థాయిలో వచ్చే రెండు నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలన్నారు.

ఇప్పటివరకు 69 లక్షల మందికి సింగిల్ డోసు ఇచ్చామని, 26 లక్షల 33 వేల 351 మందికి రెండు డోసులు ఇచ్చామని తెలిపారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదన్నారు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దని స్పష్టం చేశారు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి, రెండోసారి చేస్తే క్రిమినల్‌కేసులు చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement