కడప: పోలింగ్ రోజున కడప గౌస్‌నగర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ, ఐదుగురు ఎస్‌ఐలకు ఛార్జ్ మెమో జారీ జారీ చేశారు. కడప వన్‌టౌన్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు రంగస్వామి, తిరుపాల్ నాయక్, మహమ్మద్ రఫీ, ఎర్రన్న, అలీఖాన్‌కు ఛార్జ్ మెమోలు పంపించారు. వీరందరిపైనా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా, 13వ తేదీన కడప నగరంలోని గౌస్‌నగర్‌లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. టిడిపి కార్యకర్తలపై దాడులకు తెగబడేలా వైకాపా కార్యకర్తలను మంత్రి అంజద్‌బాషా కుటుంబ సభ్యులు రెచ్చగొడుతూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరినీ నిలువరించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులందరికీ ఛార్జి మెమోలు దాఖలు చేశారు.
కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు
జూన్ 4 న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్.పి కౌశల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కౌంటింగ్ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల 1 నుండి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహనిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని వివరించారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, ఎస్.బి ఇన్స్పెక్టర్ జి.రాజు, వన్ టౌన్ సి.ఐ సి.భాస్కర్ రెడ్డి, నగరంలోని సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.