Friday, November 22, 2024

Andhra Pradesh – సిపిఐ – కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పదం

అమరావతి – ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కి కాంగ్రెస్ పార్టీ ఓ లోక్ సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయించింది.

ఇవన్నీ ప్రాధాన్యత ఉన్న సీట్లే కావడం విశేషం. ఇందులో ఇప్పటికే వైసీపీకీ, విపక్ష ఎన్డీయే కూటమికీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగానే ఈ సీట్లు కమ్యూనిస్టులకు ఇచ్చారా అన్న చర్చ మొదలైంది.

ఏపీలో ఈసారి కాంగ్రెస్ తో ఉన్న ఇండియా కూటమి పొత్తులో భాగంగా గుంటూరు లోక్ సభ స్ధానాన్ని సీపీఐకి కేటాయించారు. గుంటూరు లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చే మంగళగిరితో పాటు పలు సీట్లలో కమ్యూనిస్టుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఈ సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం సీట్లు కేటాయించారు. ఇందులో కోస్తాంధ్రలో 3, రాయలసీమలో 5 ఉన్నాయి.

ఈ సీట్లు మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల్సి ఉంది. వీటిలో 5 లోక్ సభ, 144 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్ధుల్ని కూడా ప్రకటించింది.

షర్మిల వైఎస్సార్ జిల్లాలో ఎన్నికల ప్రచారం

- Advertisement -

పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి వైఎస్సార్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పాత నేతలంతా తిరిగి పార్టీలో చేరుతుండటం, వీరికి రాయలసీమ జిల్లాల్లో ఇంకా ఉనికి కొనసాగిస్తున్న సీపీఐ కూడా జత కలవడంతో ఈసారి ఎన్నికల్లో అద్భుతాలు జరగకపోయినా ప్రత్యర్ధుల గెలుపోటముల్ని కొంత మేర ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement