Friday, November 22, 2024

Andhra Pradesh – ఎన్నికలకు రాష్ర్ట కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా ముందడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలతో.. ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేశారు.

ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కీలక సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో… ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీలోని అన్ని అనుబంధ విభాగాలను సమాయత్తం చేయటం, వాటిని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా కీలక చర్చలు జరిగాయి.

ఏపీ సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకొనటంతో… వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆ పరిస్థితు లను కూడా రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఏఐసీసీ ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసారు. ఎన్నికల రోడ్ మ్యాప్ లో ఈ అంశాలను కూడా కీలకంగా పరిగణిస్తున్నారు. దీనితో ఎన్నికలకు సంబంధించి పక్క రాష్ట్రాల సహకారం, దానికి చేపట్టాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చ సాగింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి టార్గెట్ వైసిపి లక్ష్యంగా ఎన్నికల బరిలో దూకాలని కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేసింది. ఏపీలో వైసిపి ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యల వలన ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిన అంశాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఏఐసీసీ ముఖ్యులు.. రాష్ట్ర నేతలకు సూచించారు.

- Advertisement -

రాష్ట్ర విభజన జరిగి సుమారు పదేళ్లు పూర్తి కావస్తున్నా… ఆంద్రప్రదేశ్ కు న్యాయబద్ధంగా అందాల్సిన నిధులు, విభజన హామీలు ఏవి అమలు కాకపోవడంతో రాష్ట్రం.. తీవ్రంగా నష్టపోయిన అంశాన్ని.. సమావేశంలో ప్రముఖంగా చర్చించారు. విభజన సమయంలో… కాంగ్రెస్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని… రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక విభజన చట్టం చేసినా…. ప్రాంతీయ పార్టీల పాలనలో ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటివి దశాబ్ద కాలంగా… అందని ద్రాక్ష గానే మిగిలిన విషయాన్ని ప్రజల్లోకి ముఖ్యంగా, యువతకు చేరేలా… ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

విభజన హామీలన్నీ సక్రమంగా అమలు కావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను కూడా… క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చర్చించినారు. దీనికి ఎన్.ఎస్.యు.ఐ., మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ లాంటి విభాగాలు కీలక భూమిక పోషించాలని ఏఐసీసీ ముఖ్య నేతలు రాష్ట్ర నాయకత్వానికి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement