అమరావతి – ఏపీ రాజకీయాల్లో అసలు సిసలు హీట్ రాజుకుంది. ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో నిలబడతారా? లేదా అనే మీమాంశకు తెరపడింది. కడపలో కాంగ్రెస్ బలం అంతంతేనని స్పష్టం చేసిన షర్మిల ఎట్టి పరిస్థితిలోనూ తన పురిటిగడ్డలో తన తండ్రి వారసత్వాన్ని చాటుకోవటానికి కడప బరిలో దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తన అస్త్రాన్ని సంధిస్తోంది. వివేకానంద రెడ్డి తనయ డాక్టర్ సునీతకు ఇచ్చిన మాట ప్రకారం, తన సోదరుడు వైఎస్ జగన్ జమానాలో షర్మిలా పోటీకి దిగటం ఖాయమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బయలుదేరిన క్షణంలో సీఎం జగన్ తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకోగా.. వైఎస్ షర్మిలా కడప బరిలో పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాను ఇచ్చిన మాటకే షర్మిలా నిలబడ్డారు.
కాగా,వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, రఘువీరారెడ్డి, జెడి శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఢిల్లీలో సోమవారం జరిగిన సీఈసీ సమావేశంలో ఏపీలో పోటీ చేసే అభ్యర్థులపై అదిష్టానం కసరత్తు చేసింది. . వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, విశాఖపట్నం నుంచి సత్య రెడ్డి ఉండనున్నారు. కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు నిలవనున్నారు. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు ఎంపీ స్థానాలను పెండింగ్ లో ఉంచారు. . కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పక్కన పెట్టారు. 114 అసెంబ్లీ స్థానాల్లోనూ కొందరి పేర్లను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 61 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది ఇలా ఉంటే , ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించారు. ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు.