Saturday, June 29, 2024

Andhra Pradesh – చంద్రబాబు క్యాబినెట్ నిర్ణ‌యాలు ఇవే….

అమ‌రావ‌తి – మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం . దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగింది.. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్‌ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. దీనికి ఆమోదం తెలిపింది కేబినేట్ .

- Advertisement -

అలాగే పింఛన్ల పెంపు అంశంపైనా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.

వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణకు ఆమోదం

వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండనున్నారు. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు…

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గ ఆమోదం
ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపునకు క్యాబినెట్ ఆమోదం…
పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం
రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ… సభ్యుడిగా నారా లోకేశ్
7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్,
పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదల
వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ
పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు

Advertisement

తాజా వార్తలు

Advertisement