Friday, November 22, 2024

Andhra Pradesh – ఆర్థిక సంఘం నిధులు స్వాహా – కోట్లాది రూపాయిలు మింగేస్తున్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పడుతున్నాయి.. నిర్దేశించిన లక్ష్యాలకు తిలోదకాలిచ్చి కోట్లాది రూపాయల మేర అక్రమాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో పంచాయతీ రాజ్‌ అధికారులు కొందరు సూత్రదారులుగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో విజిలెన్స్‌ రంగంలో దిగింది. కొన్ని పంచాయతీల్లో రికార్డులు తారు మారు చేయటంతో పాటు నకిలీ బిల్‌బుక్స్‌, వోచర్లు, ఎం బుక్‌ లతో సహా సృష్టించి అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నా లు చేస్తున్నట్లు వినికిడి. ఒక్క కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామ పంచాయతీలోనే నాలుగు కోట్ల పై చిలుకు అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. ఇలా చాలా జిల్లాల్లో వందకు పైగా పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ అయినట్లు సమాచారం. 2016 నుం చి 20 వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 8654 కోట్లు మంజూరు చేసింది. ఇుందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3635 కోట్లు విడుదల చేసింది. ఇంకా బేసిక్‌, టైడ్‌ గ్రాంట్‌ కింద భారీగా నిధులు కేటాయించింది.

2021-22కు బేసిక్‌ గ్రాంట్‌గా (40శాతం) 775.60, టైడ్‌ గ్రాంట్‌గా (60శాతం) 1163.40, 2022-23కు 804, 1206, 2023-24కు 812.4, 1218.6, 2024-25కు 860.8, 1291.2, 2025-26కు 839.6, 1259.40 మొత్తం 10వేల 231 కోట్లు ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం నిధులపై నియంత్రణ ఉండటంతో పెద్దగా అవినీతికి ఆస్కారంలేదని 14వ ఆర్థిక సంఘంలోనే పెద్దఎత్తున నిధులు కైంకర్యం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంంబంధించిన రికార్డులు, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తే అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. కొందరు జిల్లా పంచాయతీ అధికారులే అక్రమార్కులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి కనుసన్నల్లోనే విచారణ తొక్కి పట్టి ఉంచినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండరాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పదేపదే శాఖల వారీ సమీక్షా సమావేశాల్లో అధికారులను ఆదేశించడంతో పాటు ప్రతి కార్యాలయంలో ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను విధిగా ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో అవినీతి నిరోథకశాఖ, విజిలెన్స్‌ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలకు జమయ్యే సాధారణ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయి.

కొందరు బిల్‌ కలెక్టర్లు వసూలు చేసిన సొమ్మును సంబంధిత పంచాయతీకి జమ చేయకుండా అధికారులు స్వాహా చేస్తున్నట్లు తెలియవచ్చింది. స్వీపర్ల చేత కూడా పంచాయతీ పన్నులు వసూలు చేయించడం ఆపై రఫ్‌ కాగితంపై వారు వసూలు చేసి ఇచ్చిన సొమ్ముకు సంబంధించి సంతకం చేయటం అవి రికార్డుల్లో చేరకపోవటంతో ప్రభుత్వాదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది. చివరకు పంచాయతీలకుసంబంధించిన పాస్‌ బుక్‌లు కూడా కొన్నిచోట్ల నకిలీవి రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన వారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా చేతివాటాన్ని ప్రదర్శించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం బయటకు పొక్కితే అక్రమార్కులు తప్పించుకునే అవకాశాలు ఉన్నందున రిపోర్టును అధికారులు తొక్కిపడుతున్నట్లు తెలిసింది. అవినీతి బాగోతం స్పందన ఫిర్యాదులో వెలుగుచూసినట్లు తెలిసింది.

వేట్లపాలెం గ్రామ పంచాయతీలో అక్రమాలకు సంబంధించి త్వరలో విజిలెన్స్‌ అధికారులు రికార్డులను సీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పైపులైన్ల నిర్మాణం, సీసీ, గ్రావెల్‌ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేసినట్లుగా చూపటంతో పాటు సాధారణ నిధుల్లో సిబ్బంది జీతబత్యాలు, ఎల్‌ఈడీ బల్బుల కొనుగోలు రూపేణ ఓచర్లు సృష్టించటం, అడ్వాన్స్‌లు , గోదావరి నీటితో చెరువులు నింపటంతో పాటు డ్రెయినేజీ సర్వేలు తదితర పనులు నిర్వహించినట్లు ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు పెద్దత్తున దోచేశారనే అభియోగాలపై ప్రాథమిక విచారణ జరిగింది. ఈ గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలకు పైగా అంటే రూ. 3 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు, మరో రెండు కోట్ల వరకు సాధారణ నిధులు కైంకర్యం చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి నుంచి జి ల్లా పంచాయతీ అధికారి వరకు ప్రమేయం ఉన్నట్లు విచారణలో గుర్తించారు.
అయితే ఇక్కడ విచారణ జరిగిన తరువాత నిధులు దుర్వినియోగం జరిగిందని తేల్చి మరో అధికారితో విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో కోట్లాది రూపాయలు హాంఫట్‌ అయినట్లు గుర్తించారు. ఈ అవినీతి బాగోతానికి సంబంధించిన ఎంక్వయిరీ రిపోర్టులన్నీ డీఎల్‌డీఓ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇక జిల్లాల వారీగా చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, కృష్ణా జిల్లాలో పెద్దఎత్తున ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగిందని సమాచారం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు పంచాయతీల్లో నిధుల స్వాహా పర్వంపై అధికారులు కన్నేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో లక్షలాది రూపాయల మేర ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలియవచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement