Tuesday, November 19, 2024

Andhra Pradesh – ఏమండీ.. ఎవ‌రు గెలుస్తారూ… నాలుగు సీట్లపైనే అందరి కన్ను..

పొలిటిక‌ల్‌ డిబేట్!
ఆ నాలుగు సీట్ల‌పై ఉత్కంఠ
కుప్పం సీటుపై వైసీపీ ఆశలు
పిఠాపురంలో నెల‌కొన్న‌ అలజడి
మంగళగిరిలో నెగ్గేది ఎవ‌రు?
బాల‌య్య‌పై బీసీ అస్త్రం ప‌నిచేసేనా
క‌డ‌ప‌లో ష‌ర్మిల నెగ్గుకొస్తుందా
ఆ ముగ్గురు మహిళల భవిత‌వ్య‌మేంటి
పెద్ద ఎత్తున కొన‌సాగుతున్న బెట్టింగులు
ఎక్క‌డ విన్నా ఇదే హాట్ టాపిక్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. గత నలభై ఏళ్లలో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా కూటమి నేతలు భావిస్తుండగా.. కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికి వస్తాయనే భయంతో జనం పోటెత్తారని, అదంతా ప్రో గవర్నమెంట్ ఓటని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈసారి ఎన్నికల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం స్థానాల్లో విజయాన్ని వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు. ఆ నాలుగు స్థానాల్లో ఎలాగైనా జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత జగన్ భావించారు.. వీటిలోని మూడు స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిపై . చర్చలు, ప‌రిశీల‌న‌ల వంటివి హాట్ హాట్ డిబేట్ సాగుతున్నాయి.

- Advertisement -

కుప్పంలో కొట్టగలరా?

కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు కంచుకోట. ఇక్కడ బాబుకు ఎదురులేదు, తిరుగులేదనే చెప్పాలి. అయితే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని ఓడించాలని వైఎస్సార్ అధినేత‌ జగన్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకూ చూడని అభివృద్ధిని చూపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వైసీపీ సత్తా చాటడం.. చంద్రబాబు మునుపెన్నడూ లేనివిధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేశారు. ఈ సమయంలో కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. కానీ, అది అంత ఈజీ కాదనేది రాజకీయ పరిశీలకుల వాదన.. వాస్తవానికి చంద్రబాబుని ఓడించకపోయినా బలమైన పోటీ ఇచ్చి, కౌంటింగ్ రోజు టెన్షన్ పెట్టించి, మెజారిటీని భారీగా తగ్గిస్తే అది కచ్చితంగా తమ నైతిక విజయమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక పిఠాపురంలో టెన్షన్.. టెన్షన్

ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో… ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లి తెర నటీ నటులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు.
ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి, తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది. కానీ… పవన్‌పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు కాపు సామాజిక వర్గం తీవ్రంగా కలత చెందిందని, వైసీపీకి ఈ వర్గం దూరమైందనే మరో కథనం వినిపిస్తోంది. ఈ స్థితిలో విజయం ఎవరిని వరించబోతుందనేది అత్యంత కీలక అంశంగా మారింది.

మంగళగిరిలో లోకేశ్‌..

2014 ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత లోకేశ్‌ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కేపై 5,337 ఓట్లతో ఓడిపోయారు. అయితే.. ఈ సారి ఆ నెంబర్‌కి పక్కన సున్నా కలిపి.. యాభై వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోపక్క లోకేశ్‌పై పోటీకి మురుగుడు లావణ్యను జగన్ బరిలోకి దించారు. ఈసారి కూడా మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించాలని బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేటాయించి, వ్యూహాలు అమలుచేశారని చెబుతున్నారు. మరి ఈసారైనా చినబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి.

హిందూపురంలో హ్యాట్రిక్ సాధ్యమేనా?

హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేశారు. 2014లో 16వేలు, 2019లో 18వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన బాలయ్య… ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్సయ్యారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పైగా ఈ సారి కూటమి అధికారంలోకి వచ్చి, బాలయ్య గెలిస్తే కేబినెట్‌లో ఉంటారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్యపై జగన్ బీసీ అస్త్రం ప్రయోగించారు. ఇందులో భాగంగా.. కోడూరి దీపికను రంగంలోకి దింపారు. అయితే.. వేవ్ మాత్రం బాలయ్య వైపు ఉందని కథనాలొస్తున్నప్పటికీ… బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటిపైకి వచ్చారనే చర్చ కూడా వినిపిస్తుండటం గమనార్హం..

Advertisement

తాజా వార్తలు

Advertisement