ఏపీ ఎన్నికల సంఘం తొలి వేటు శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారుల్లో కలవరం ఆంధ్రప్రభ వార్తకు స్పందించిన ఈసీ అధికారులు(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) రాజకీయ నాయకులకు గులామ్ గిరి చేసే అధికారులను, ఉద్యోగులను సహించేది లేదని ఏపీ ఎన్నికల సంఘం అధికారులు నిరూపించారు. పేరుకు వీఆర్వో గ్రామ బాగోగులపైనే దృష్టి పెట్టాలి, కానీ ఆ ఉద్యోగి మళ్లీ మన ఎమ్మెల్యేనే గెలిపించండనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రభ విలేఖరు యథాతథం ఆ వార్తను రాశారు. ఆంధ్రప్రభలో ప్రచురితమైంది.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమంలో పాల్గొన కూడదు. కానీ గత 4 వ తేదీన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనస కాలనీలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిమిలి గ్రామ గ్రేడ్ 1 వీఆర్వో కె.రమేష్ కూడా పాల్గొన్నారు. ఏపీసీఎస్ (సీసీ అండ్ ఏ ) రూల్స్ 1991లో రూల్ 19(1), అండ్ 19(5 కండక్ట్ రూల్ ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో వీఆర్వోను సస్సెండ్ చేస్తూ శ్రీకాకుళం డీఆర్వో ఎం.గణపతిరావు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రభ వార్తకు అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకోవటం విశేషం. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను ప్రచురించే ఆంధ్రప్రభ జర్నిలిజం వైఖరిపై ప్రజలు ప్రశించారు.