Saturday, November 23, 2024

Andhra Prabha – కుప్పంలో బాబుకు బై బై – ఆయన పాలనలో ఒక్క స్కీం లేదు – జ‌గ‌న్

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం
పెత్తందారులకు ఇష్టం లేదు
రాష్ర్టంలో 71,800 ఎకరాలు సేకరించాం
రూ.32 వేల కోట్లు ఖర్చు చేశాం
ఇళ్ల పట్టాలివ్వకుండా కేసులు పెడుతున్నారు
ఇక్కడ దోచుకోవటం.. పంచుకోవటమే
నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్ల లక్ష్యం
ఆలోచించండి.. మంచి జరిగితే
మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి
ఒంగోలు సభలో సీఎం జగన్

ఒంగోలు బ్యూరో (ప్రభన్యూస్) : “ నేను ఏమైనా అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడు కానీ.. తాను చేసిన మంచి చెప్పడు..చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు..మనం సిద్ధం అంటుంటే బాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది..ఏకంగా కుప్పంలో జనం మాత్రం బై బై బాబు అంటున్నారు” అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. ఒంగోలులో పేదలకు సర్వహక్కులతో భూపత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పరిధిలోని 20,480 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పేదల స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం మనది అన్నారు. 71,800 ఎకరాల భూమిని గుర్తించి 15500 లే ఔట్లు ఏర్పాటు చేశామన్నారు.

32వేల కోట్ల ఖ‌ర్చుతో 24 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం..

32వేల కోట్ల ఖర్చుతో 24 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం, ఇప్పటికి 8 లక్షల ఇళ్లు కట్టించాం, లే ఔట్ చేసిన స్థలాల విలువ 2.5 లక్షల నుంచి 16 లక్షలకు .. ఒంగోలులో రెండు లే ఔట్లులో ఇంటి స్థలం విలువ గజం 10 వేలకు పైనే ఉంద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ప్రతి ప్లాటు విలువ ఆరులక్షల రూపాయలు కాగా.. 2..70 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు మిలినియర్లుగా మార్చాం అని జగన్ వివరించారు. 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టామన్నారు. గత ప్రభుత్వాలు ఇలా పాలించలేదన్నారు. మంచి కోసం పని చేస్తుంటే.. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఇంటి స్థలం ఇవ్వలేదని, అక్కసుతో రాక్షసుల్లా అడ్డుకునేందుకు 1191 కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు ఇవ్వకూదని కేసులు వేశారని, పేదలకు కావాల్సింది స్థలం కానీ పెత్తందారులు అడ్డుకొన్నారని, అడ్డంకులన్నీ దాటామన్నారు. వీళ్ళు చెబుతున్న అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వనివ్వలేదన్నారు. అక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత లోపిస్తుందని కేసులు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంగ్లీష్ స్కూళ్లు వ‌ద్ద‌న్న చంద్ర‌బాబు..

జంకు, బొంకు లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు..గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ కూడా వద్దని వాదించాడని,ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఎవరైనా పుడతారా అని గతంలో మాట్లాడాడన..బీసీల తోకలు కత్తిరిస్తానని ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని బాబు మోసం చేశాడని, పొదుపు సంఘాలను మోసం చేసిన బాబుకు మహిళల ఉసురు తగులుతుందన్నారు. 650 వాగ్దానాలతో రంగురంగుల మ్యానిఫెస్టోలో పెట్టారని, ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పగలడన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఈ పెద్దమనిషి నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీం ఏదైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారని, ఏ నాడూ ఏపీకి రానివాళ్లు, ఏపీలో లేనివారు మాత్రమే బాబును సమర్థిస్తున్నారని, నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్ళు మాత్రమే సమర్థిస్తున్నారని జగన్ చెప్పారు.

- Advertisement -

నాకు ద‌త్త‌పుత్రుడు ఎవ‌రూ లేరు..

చంద్రబాబు మాదిరి నాకు దట్టపుత్రుడి మద్దతు లేదని, .మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మద్దతు ఇవ్వండి..నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా.. ఏ దళారిని కూడా నమ్ముకొలేదని జగన్ అన్నారు. రాక్షసుల కంటే బాబు దుర్మార్గం ఎక్కువని ప్రజా జీవితంలో బాబు జంకుగొంకు లేకుండా బతుకుతున్నాడని, గవర్నమెంటు స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం వద్దని వాదిస్తున్నాడని, ఎస్సీల్లా ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు ప్రశ్నించాడని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మాయలోడు , ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించాలని జగన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement