Saturday, December 14, 2024

AP | టూరిజం అభివృద్ధికి ఆంధ్ర – కాశ్మీర్ పరస్పర సహకారం

డాబాగార్డెన్స్, డిసెంబర్ 14 : టూరిజం రంగంలో కాశ్మీర్ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందో ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా అందరి దృష్టిని తనవైపు మలచుకుంటుందని కాశ్మీర్ కి చెందిన ట్రావెల్ ఏజెన్సీ సంఘ నేతలు ఐటో చైర్మన్ (కాశ్మీర్) నజీర్ షా, ఏడిటిఓఐ చైర్మన్ (కాశ్మీర్) మీర్ అన్వర్ అభిప్రాయపడ్డారు. ఎత్తైన మంచు కొండలు, చూడచక్కని ప్రదేశాలు, జలపాతాలు, అడ్వెంచర్ టూరిజంతో కాశ్మీర్ అలరారుతుంటే ఆంధ్రప్రదేశ్ అన్నిరకాల హంగులతో పర్యాటకులను ఆకట్టుకుంటుందన్నారు.

శనివారం ఉదయం హోటల్ గ్రీన్ పార్క్ లో జరిగిన సమావేశంలో ఈ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హిల్ టూరిజం, బీచ్ టూరిజం, స్పా టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు విపరీతంగా ఆదరణ పెరిగిందన్నారు. విశాఖలో తాము మూడు రోజులు పాటు పర్యటించామని సాగర తీరం ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపించిందన్నారు.

అదేవిధంగా కైలాసగిరి, రుషికొండ, తోట్లకొండ, భీమిలి తదితర ప్రాంతాలను సందర్శించామని నజీర్ షా, అన్వర్ లు పేర్కొన్నారు. కైలాసగిరి కొండపై ఉన్న రైలు మార్గాన్ని, రైలును ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కైలాసగిరి కొండపై, రుషికొండ వద్ద విపరీతమైన చెత్త పేరుకుపోయిందని, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని తాము గ్రహించినట్లు చెప్పారు. ఆంధ్ర నుంచి వేలాది మంది పర్యాటకులు కాశ్మీర్ కి వచ్చి ఆనందంగా గడుపుతున్నారని, ఇకపై కాశ్మీర్ నుంచి ఆంధ్రకు పర్యాటకులను పంపించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి విజయ మోహన్, జిల్లా టూరిజం అధికారి జ్ఞానవేణి తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని అమల్లోకి తీసుకొచ్చిందని, దానివలన టూరిజం ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్, రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అధినేత దాడి రవికుమార్, గంట్ల శ్రీనుబాబు, పలువురు ట్రావెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement