Saturday, November 23, 2024

Breaking: కస్టడీలో ఉన్న దళిత మహిళపై చిత్రహింసలు.. కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినందుకు గాను కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఉమా మహేశ్వరి (34) అనే దళిత మహిళపై చోరీ కేసు నమోదైంది. ఉమా మహేశ్వరి.. రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉందని, ఆమె రూ.2 లక్షలు దొంగిలించిందని జనవరి 19న పోలీసులకు ఫిర్యాదు అందింది. సీనియర్ పోలీసు అధికారి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు ఉమా మహేశ్వరి, ఆమె భర్త దీనాను అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న తనను చీకటి గదిలో ఉంచి, దుర్భాషలాడారని, శారీరకంగా కొట్టారని ఆమె ఆరోపించింది.

“నన్ను కట్టేసి ఒక గదిలో ఉంచారు. పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 1 నుంచి 1:30 గంటల మధ్య వారు నన్ను రెండు చేతులు, కాళ్లపై బాగా కొట్టారు. నేను అరవకుండా నా నోటిలో బట్టలు కుక్కారు. నన్ను హింసించడానికి కర్రలు ఉపయోగించారు” అని బాధితురాలు ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను పోలీసు సూపరింటెండెంట్ ఖండించారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సెంథిల్ కుమార్ కానిస్టేబుల్ వి సురేష్ బాబును సస్పెండ్ చేశారు. దీనిపై మరింత విచారణ చేసి తదుపరి రిపోర్ట్ అందించాలని చిత్తూరు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని డీఐజీ ఆదేశించారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కంప్లెయింట్ చేసిన తెలుగుదేశం పార్టీ..

పోలీసు కస్టడీలో ఉన్న దళిత మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. అక్రమ నిర్బంధానికి కారణమైన వ్యక్తులపై విచారణ జరిపి నిరోధక చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) చైర్‌పర్సన్‌ను రామయ్య కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement