Tuesday, November 26, 2024

AP: ఇక ప్ర‌జాపాల‌న‌.. తిరుమ‌లతోనే ప్ర‌క్షాళన ప్రారంభం.. చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వెంటనే తిరుమల తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం చంద్రబాబు..

గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తమది దేశ చరిత్రలోనే చరిత్రత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు తెలిపారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని.. దానిని గాడిలో పెట్టి.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు

- Advertisement -

”1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేది. ఆ తర్వాత ప్రక్షాళన చేశాం. సరికొత్త పాలన ప్రారంభించాం. వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. సంపద సృష్టించాలి.. దాన్ని పేదలకు పంచాలి. గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారు. వారిపై అపారమైన గౌరవం ఉంది.. రుణపడి ఉన్నా. ఐదు కోట్ల మందికి ప్రతినిధిని. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు. పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇకపై ఉండవు. నేరస్థులను సహించేది లేదు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభ్యమయ్యేలా చేశారు. శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు.

కక్ష సాధింపులు ఉండవు

ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి.. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. తితిదేను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement