Friday, November 22, 2024

AP | ఇక అందరి చూపు ‘తుడా’ వైపు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి) ధర్మకర్తల మండలి నియామకం జరిగిన నేపథ్యంలో అందులో చోటుదక్కని ఆశావహులైన కూటమి వర్గాల దృష్టి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ పోస్టుపై పడుతోంది. గతంలో కన్నా భిన్నంగా తుడా చైర్మన్ ను టి టి డి ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడమే అందుకు మౌలికంగా కారణమవుతోంది. కనిపిస్తున్న ఆశావహుల జాబితా ప్రకారం తుడా చైర్మన్ రేసులో కూటమి పార్టీలకు చెందిన 10 మంది పోటీ పడుతున్నట్టు స్పష్టమవుతోంది.  

తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 అర్బన్ మండలాలు (తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, నాయుడుపేట, వేంకటగిరి  గూడూరు) లతో పాటు 41 రూరల్ మండలాల పరిధులతో ఏడెనిమిది శాసనసభ నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న తుడా రాష్ట్రంలో వైజాగ్ అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ (వుడా) తరువాత రెండవ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా పేరొందింది తొలి చైర్మన్ గా వి.వెంకటమునిశెట్టి నియమితులు కాగా, గత నలభై ఏళ్లలో పది మందికి ప్రముఖులు తుడా చైర్మన్లుగా పనిచేశారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై ఎస్ రాజశేఖర రెడ్డి తన సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డిని తుడా చైర్మన్ గా నియమిస్తూ ఆయన కోసం ఒక చట్ట సవరణ చేశారు.

ఆ సవరణ ప్రకారం తుడా చైర్మన్ గా నియమితులైన వారు  టి టి డి ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగే అవకాశం కల్పించారు. కరుణాకర రెడ్డి తరువాత తుడా చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఆ అవకాశం లభించింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుడా చైర్మన్ గా నియమితులైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినా తుడా చైర్మన్ పదవిలోనే కొనసాగారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తుడా చైర్మన్ ను టి టి డి బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగించడం ఇష్టం లేకపోయినా వెంకటరమణ కోసం ఆమోదించారు. 

- Advertisement -

2014 చివరలో వెంకటరమణ మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుగుణమ్మ పోటీ చేసి గెలుపొందారు. అయితే తుడా చైర్మన్ గా ఉండేవారు టి టి డి ధర్మకర్తల మండలిలో సభ్యుడుగా కొనసాగే అవకాశం కల్పించే చట్ట సవరణను చంద్రబాబు రద్దు చేశారు. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తుడా చైర్మన్ అయిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు నరసింహ యాదవ్ కు మాత్రం టి టి డి బోర్డులో కొనసాగే అవకాశం దక్కలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మళ్ళీ ఆ చట్ట సవరణ అమలులోకి వచ్చింది. ఫలితంగా గత అయిదేళ్ల మధ్య కాలంలో తుడా చైర్మన్ గా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి టి టి డి ధర్మకర్తల మండలిలో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కొనసాగారు. తాజా ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత తుడా చైర్మన్ కు టి టి డి బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగిస్తారా లేదా అనే సందిగ్దత గత నాలుగు నెలలుగా కొనసాగింది.

తాజాగా టి టి డి నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో తుడా చైర్మన్ కు ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించారు. దీంతో ఇప్పటివరకు టి టి డి ధర్మకర్తల మండలిలో సభ్యత్వం కోసం పోటీలు పడి నిరాశ చెందిన కూటమి పార్టీల నాయకుల్లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. ఇప్పటికే  పలురకాల సమీకరణల నడుమ తెలుగుదేశం పార్టీకి చెందిన మబ్బు దేవనారాయణ రెడ్డి, డాలర్స్ దివాకర రెడ్డి, సూరా సుధాకర రెడ్డి, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన పార్టీకి చెందిన డాక్టర్ హరిప్రసాద్, బి జె పి కి చెందిన కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్ ల పేర్లు గత రెండు నెలలుగా తుడా చైర్మన్ రేసులో వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమి పార్టీల తరపున టి టి డి ధర్మకర్తల మండలి సభ్యత్వం ఆశించిన ఏడెనిమిది మందిలో బి జె పి కి చెందిన భాను ప్రకాష్ రెడ్డికి మాత్రం చోటు దక్కింది.

అందుకు ఆయన ఢిల్లీ స్థాయిలో తనకున్న పరపతిని వాడుకోవడమే దోహదపడింది. దీంతో ప్రస్తుతం టి టి డి సభ్యులు కావాలనుకున్న ఆశావహులు తుడా చైర్మన్ పదవిపై దృష్టిని సారించారు. ప్రస్తుతం మరో ఆరేడుమంది కూటమి పార్టీల ప్రతినిధులు తమకున్న పరపతితో అమరావతిలో పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఇప్పటికే తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్న అయిదారుమందికి మరో ఐదారుగురు ఆశావహులు తోడైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో వివిధ కీలక నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు కొనసాగుతున్న దశలో త్వరలోనే తుడా చైర్మన్ పదవి భర్తీ కూడా జరిగిపోతుందని కూటమి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందండంతో బాటు టి టి డి బోర్డు సభ్యుడుగా కొనసాగే అవకాశం ఉన్న తుడా చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని అంశం కూటమి పార్టీలలో చర్చనీయాంశమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement