Saturday, November 23, 2024

పోల‌వ‌రం త‌వ్వ‌కాల్లో పురాత‌న శివ‌లింగం.. బ‌య‌ట‌కు తీసి పూజ‌లు చేస్తున్న జ‌నం

పోలవ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు చేస్తుండ‌గా గోదావ‌రి న‌దిలో ఓ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఏలూరు జిల్లా పోల‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న ఇవ్వాల వెలుగుచూసింది. ప్రాజెక్టులోని స్పిల్‌వే ఎగువ‌న అప్రోచ్ చాన‌ల్‌లో భాగంగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ప్రాజెక్టు నిర్వాసిత పాత పైడిపాక గ్రామంలోని గోదావ‌రి ఒడ్డున భూగ‌ర్భంలో ఇటుక‌ల‌తో నిర్మించిన పురాత‌న నిర్మాణం ఒక‌టి జేసీబీకి త‌గ‌లింది. దీంతో ఆప‌రేట‌ర్లు గ‌ట్టిగా లాగ‌డంతో భూగ‌ర్భంలో ద‌శాబ్దాల కాలంనాటి శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా లారీ డ్రైవ‌ర్లు, వ‌ర్క‌ర్లు ఉలిక్కిప‌డ్డారు.

ఆ వెంటనే పనులను ఆపేసి విగ్రహాన్ని బయటకు తీసి గట్టుపై పెట్టి  గోదావరి జలాలతో అభిషేకించారు. శతాబ్దాల కాలం నాటిదిగా భావిస్తున్న ఈ శివలింగాన్ని అక్కడే ఉంచి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో పురాతన శివాలయం ఉంటుంద‌న్న భావ‌న‌లో అక్క‌డి ప్రాంత వాసులున్నారు. అయితే మరిన్ని దేవతా విగ్రహాలు కూడా ఉండి ఉంటాయ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పురావస్తు పరిశోధన శాఖ అధికారులు శ్రద్ధ వహించి తవ్వకాలు జరిపితే ప్రాచీన కాలపు దేవతా విగ్రహాలు, ఆలయ అవశేషాలు ల‌భించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే స్థానికులు కొందరు బయటపడ్డ శివలింగానికి పూజ‌లు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement