Thursday, November 21, 2024

AP: కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన… ఎంపీ అవినాష్ రెడ్డి

పులివెందుల, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువైందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయ‌న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వీఆర్ఏ నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జెనెటిక్స్ పేలుడుపై జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ లు, పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం టీడీపీ నాయకులు నడిపిస్తున్నారన్నారు.

పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు ఎక్కువగా అయ్యాయని, వీటికి కారణం మట్కా, జూదమేనన్నారు. మట్కా జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వారు దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. పులివెందుల పట్టణంలో మారుతి థియేటర్ సమీపంలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ ఆఫీస్ కు తీసుకువెళ్లడం ఎంతో దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అక్రమాలు పెరిగిపోయాయన్నారు. పులివెందులలో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదు ఎప్పుడూ లేదన్నారు.

టీడీపీ నాయకులు కొత్త సంస్కృతి తెస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదని, పులివెందులలో జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలన్నారు. పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ కి వచ్చిన 50అడ్మిషన్లను తిరిగి వెనక్కి పంపించింది కూటమి ప్రభుత్వమేన‌న్నారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో విచ్చలవిడిగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయన్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో కోట్ల రూపాయలు వెచ్చించి అరటికాయలు నిలువజేసే ఏసీ గోదాములు నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రారంభించి రైతులకు మేలు చేయాలన్నారు. తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా అందరూ చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇలాంటి పనులు చేయొద్దని ఆయన హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement