Friday, November 22, 2024

జల్లికట్టు, కోడి పందేల పై ప్రత్యేక నిఘా – అనంతపురం రేంజ్ డిఐజి 

అనంతపురం (రాయలసీమ ప్రభ్ వెబ్ ప్రతినిధి) : అనంతపురం రేంజ్ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఎక్కడా కూడా జల్లికట్టు, కోడి పందేలు, జూద క్రీడలు జరుగకుండా చూసేందుకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాట్లు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని రేంజి డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంప్రదాయ క్రీడలు నిర్వహించుకుని భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని రేంజ్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని సి.ఐ లు, ఎస్సైలు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి నిషేధిత కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. 

సంబంధిత డీఎస్పీలు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ పక్కాగా కొనసాగించాలన్నారు. కోడి పందేలు, జల్లికట్టు ఆటలు జరిగే వీలున్న ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కోడి పందేలు, జల్లికట్టులపై  కేసులున్న  వారిని ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు. కోళ్లకు కత్తులు కట్టి పందేలు ఆడటం, జన సమూహాల మధ్యన ఎద్దులను రెచ్చగొట్టి కట్టడి చేయడంలో భాగంగా హింసించడం, తదితరాలన్నీ మూగ  జీవాలను హింసించడమే  అవుతుందన్నారు. జల్లికట్టు, కోడి పందేల నిర్వహణ వేదికలకు ఎవరైనా తోటలు, స్థలాలు ఇస్తే వారిపై కూడా
కేసులు నమోదు చేయాలన్నారు. రేంజ్ పరిధిలోని అన్ని  సబ్  డివిజన్ల  పరిధుల్లో  30 పోలీస్ యాక్టు అమలులో  ఉంటుందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. కోడి పందేలు, జల్లికట్టు ఆటలు నిర్వహిస్తే ప్రివెన్ష్షన్ఆఫ్  క్రూయల్టీ టు అనిమల్ యాక్టు, ఎ.పి. గేమింగ్ యాక్టుల కింద కేసులు నమోదు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement