Saturday, November 23, 2024

AP: రెండో కాశీ.. శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం…

తాడిపత్రి టౌన్, మార్చి 2 (ప్రభన్యూస్): మనదేశంలో వివిధ ప్రాంతాల్లో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.
అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివాలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచినది శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.


అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు. పెన్నానది తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ఇక్కడ శివలింగం ప్రతిష్టింపబడినట్లు ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుచేతనే ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

రెండో కాశీగా పిలవబడే శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం :
కాశీ విశ్వేశ్వరుడి ఆలయం తరహాలో ఇక్కడ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఉత్తరానికి పెన్నా నది ప్రవహించడం, దక్షిణాన స్మశాన వాటిక కాశీ క్షేత్రంలో ఉన్న విధంగా ఇక్కడ ఉన్నట్లు స్థానిక అర్చకులు చెబుతున్నారు. అందుచేత శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం రెండో కాశీగా ఇక్కడ అర్చకులు చెబుతున్నారు.

- Advertisement -

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం:

సీతామాతను అపహరించిన రావణాసురుడిని శ్రీరామచంద్రుడు యుద్ధంలో ఓడించి సంహరించాడని అయితే రావణాసురుడు బ్రాహ్మణుడు కావడంతో రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన బ్రాహ్మణ హత్య పాపం నుంచి విముక్తి పొందడం కోసం శివలింగాలను ప్రతిష్టించాల్సిందిగా మహర్షులు తెలపడంతో శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఇక్కడ శివలింగానికి రామలింగేశ్వరుడిగా పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఉంది.. ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. బుగ్గ అనగా నీటి ఊట. వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నదిలో నీటివనరులు ఎండిపోయినా ఈ ఆలయంలోని శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుందని ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటం వల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చినట్లు ఇక్కడ అర్చకులు చెబుతున్నారు.

మంత్రముగ్దులను చేసే శిల్ప సంపద:

కొన్ని ఆలయాలను, వాటిలోని శిల్పసంపదను వీక్షిస్తే ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి. ఇంతటి శిల్పసంపద మనదేశంలో ఉన్నందుకు ఆనందం, వీటిని ఎలా చెక్కారో అని ఆశ్చర్యం కలుగుతాయి. అలాంటి ఆలయమే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది అందమైన శిల్ప కళా నిలయం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయానికి రామాచారి అనే శిల్పాకారుడు దాదాపు 650 మంది శిల్పిలతో కొన్ని సంవత్సరాలు పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఆలయంలో ఎటు చూసినా అందమైన శిల్పాలే దర్శనమిస్తాయి. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో పాటు రామాయణం, భారతంకు సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ శిల్పాల రూపంలో నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా నాగరికతకు అద్దం పట్టేలా ఇక్కడ శిల్ప సంపదను సృష్టించారు. ఇక్కడ శిల్ప సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందంటే అతిశయోక్తి కాదు.

ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు:

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో ఒకటి కార్తీక మాసం పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కార్తీకమాసంలో ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసం సోమవారాలు ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు వనభోజనాలు సైతం ఇక్కడ చేస్తుంటారు. అనంతరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని పాల్గొన్న మాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 3 నుండి 13 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10న శివపార్వతుల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement