అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో : అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు, సిసిఎస్ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషాలపై స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఉద్యోగం నుండీ డిస్మిస్ అయిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో తనపై కేసులు బనాయించి, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను దళితుడు కావడంతో తన వాదన వినకుండా ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారని ఆరోపించారు. ఈనేపథ్యంలో అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు (క్రైం నంబర్ 209/022 యు/స్ 167, 177, 182 ఆర్/బ్ల్యు 34 ఐపీసీ సెక్షన్ 3 (1) (క్యూ) సెక్షన్ 3 (2) ఆఫ్ ఎస్ సి /ఎస్టి పి ఓ ఏ యాక్ట్) కింద కేసు నమోదు చేశారు. ప్రకాష్ గతంలో పోలీసులకు రావాల్సిన వేతన బకాయిలు ఇతర అంశాల గురించి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ శాఖ అధికారులు విస్తుపోయారు. మరోవైపు ప్రభుత్వం ఆగమేగాల మీదుగా పెండింగ్‌లో ఉన్న డబ్బును కొంతమేరకు పోలీస్ ఖాతాల్లో జమ చేసింది. దీంతో ప్రకాష్ పోలీస్ వర్గాల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. వెంటనే అతని మీద శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. అతని మీద ఉన్న అనేక కేసులు విచారణ చేసి డిస్మిస్ చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో ప్రకాష్ తనపై జరిగిన అన్యాయాన్ని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతర జిల్లాల పోలీసు ఉన్నతాధికారిని నియమించి ఈ కేసును సమగ్రంగా విచారించి నివేదిక ఇచ్చేలా అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా పలమనేరు డి.ఎస్.పి గంగయ్యను విచారణ అధికారిగా నియమించారు. ఆయన అనంతపురంలో గురువారం విచారణను మొదలుపెట్టారు. పోలీస్ చరిత్రలో మొదటిసారిగా ఒక ఎస్పి పై అట్రాసిటీ కేసు అనంతపురం జిల్లాలో నమోదు చేయడమే కాకుండా ఆయనపై ఒక డిఎస్పి స్థాయి అధికారి విచారణ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రకాష్ పై అనేక కేసులు ఉన్నాయని అదనపు ఎస్పీ నాగేంద్రుడు మీడియాకు వివరించారు. విచారణ అధికారిగా ఉన్న గంగయ్యకు ఆ కేసుల జాబితాను అప్పచెప్పారు. మొత్తానికి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారం పోలీస్ శాఖలో సంచలనం సృష్టించింది. ఇది రాజకీయంగా ఒక పార్టీ తన కనుకూలంగా మలుచుకుందున్న విమర్శలు కూడా వస్తున్నాయి.