Sunday, November 17, 2024

Satya Sai District – దేశ భద్రత,సమగ్రత అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్, ఎస్పీల వెల్లడి

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 31: (ప్రభన్యూస్) అందరి బాగు కోసం కలిసి ఉండాలని భారతదేశాన్ని ఒక్కటిగా చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ ఎస్వీ. మాధవ్ రెడ్డి లు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని రస్కరించుకొని మంగళవారం రన్ ఫర్ యూనిటీ (ఏక్ దివాస్) కార్యక్రమాన్ని స్థానిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు సిబ్బంది కళాశాల విద్యార్థులు యువకులతో జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ ఎస్పీలు జ్యోతిని వెలిగించి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం దేశ సమైక్యత, సమగ్రతలకు అంకితభావంతో పాటు పడదామని సిబ్బంది, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు , ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ… భారత దేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం రాజరిక సంస్థానాలను విలీనం చేయడానికి గట్టి కృషి చేశారన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు ఇంత అభివృద్ధి లేదని భారతదేశాన్ని ఒక్కటిగా చేయడం వల్లనే నేడు దేశం అభివృద్ధిలో వెళుతున్నడమే కాక, చరిత్రలోనే ఒక గొప్ప దేశంగా నిలిపారన్నారు . గుజరాత్ లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లండన్ లో ఉన్నత విద్యను అభ్యసించారని, నెహ్రూ ప్రధాన మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేసి, సంస్థానాలు రాజ్యాలను ఒకటిగా చేసేందుకు ఉక్కు పాదం మోపి భారతదేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్ముల ఆశయాల వల్ల నేడు మనం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు స్వేచ్ఛగా, ఐక్యంగా జీవిస్తున్నామన్నారు. త్యాగధనులను స్ఫూర్తిగా చేసుకుని విధులు నిర్వహిద్దామన్నారు. జాతీయోద్యమానికి ఆకర్షితుడైన ఆయన మహాత్మా గాంధీజీ నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాల్లో పాలు పంచుకున్నాడన్నారు.

దేశ ప్రజల సంక్షేమం కోసం చాలా సాంఘిక ఉద్యమాలు నిర్వహించాడన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం, అస్పృస్యత, కుల వివక్షలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. రాజ్యాంగ సభ్యుడిగా, మంచి నాయకుడిగా భారత ప్రజలకు ఎనలేని సేవలందించి చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలిచారన్నారు. గత తొమ్మిది రోజులుగా పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ వారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. నేడు యువత టెక్నాలజీ వైపు ఆకర్షితులవుతున్నారని, స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను మరవకుండా వారిని గుర్తు పెట్టుకోవాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మహనీయుడు స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకుని కలిసి ఉండి దేశ భద్రతకు సమగ్రతకు పాటుపడాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాచరచన , వకృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ ఎస్పీలు బహుమతులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement