వరి పంట నష్టం.. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 13 (ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో కదిరి రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో భీభత్సం సృష్టించింది. గొర్రెలు పదుల సంఖ్యలో మృతిచెందగా వరి పంటకు భారీ నష్టం జరిగింది. మల్లయ్య గారి పల్లి తండా, కౌలేపల్లి, బేరిపల్లి తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ముఖ్యంగా మల్లయ్య గారి పల్లి తండాలో వర్షం కారణంగా 20 గొర్రెలు మృతి చెందాయి. పలు కుటుంబాల వారు కట్టుబట్టలతో బయటికి వచ్చారు. వృద్ధులు వర్షం నీటిలోనే మంచాలపై కూర్చుండిపోయారు. ఇటీవల తండా సమీపంలో కల్వర్టు నిర్మాణం చేపట్టారని, కేవలం ఒక పైపు మాత్రమే అమర్చి కల్వర్టు వేయడంతో వర్షం నీరు అధికమై కల్వర్టుపైన నీరు వచ్చి ఇళ్లలోకి చేరిందని స్థానికులు తెలిపారు.
ప్రాణ నష్టం జరగలేదని, కానీ పశు సంపద, నిత్యవసర సరుకులు, వస్త్రాలు వంటివి పూర్తిగా కోల్పోవడం జరిగిందని బాధితులు తెలిపారు. ఇదే సందర్భంలో ఎర్రదొడ్డి సమీపంలో వరినాట్లు వేసిన రైతులు వర్షం దెబ్బతో మొత్తం పంట నష్టపోయామని చెబుతున్నారు. ఇంకా చేతికి వచ్చిన మొక్కజొన్న, సజ్జ వంటి పంటలు కూడా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. కాగా నష్టం అంచనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వర్షం బీభత్సం కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రైతులకు తగిన పరిహారం చెల్లించే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా మల్లయ్య గారి పల్లికి చెందిన గ్రామస్తులు కోరారు.
ఇదిలా ఉండగా మంగళవారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 200.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తనకల్లు మండలంలో 94.5 మిల్లీమీటర్లు, అమడగూరులో 88.4 మిల్లీమీటర్లు, కదిరిలో 24.2 మిల్లీ మీటర్లు, హిందూపురంలో 74.6 మిల్లీ మీటర్లు, ధర్మవరంలో 62.4 పెనుకొండలో, 57.0, కొత్త చెరువులో 56.4, ఓబుల దేవర చెరువులో 55.4, సోమందేపల్లిలో 50.4, బుక్కపట్నంలో 49.6, రామగిరి లో 46.4, పరిధిలో 45.2, గోరంట్లలో 45.2, చెన్నే కొత్తపల్లిలో 42.2, పుట్టపర్తి లో 39.8, లేపాక్షిలో 37.2, నల్లమడలో 35.4 చిలమత్తూరులో 32.6, రొద్దంలో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది.
ఈ వర్షం గత రెండు వారాల క్రితం కురిసి ఉంటే వేరుశనగ పంట సాగుకు అనుకూలంగా ఉండేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈవర్షం వలన వెలసిన సాగు చేయడం వలన ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఏదేమైనా సుమారు రెండు నెలలు అనంతరం జిల్లాలో ఓ మోస్తరుగా వర్షం కురవడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.