Friday, November 22, 2024

జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు..

అనంతపురం క్రైమ్ – అనంతపురం జిల్లాలో పోలీసులు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేశారు. దీంతోపాటు గ్రామ సందర్శనలు, గ్రామ సభలు అధికంగా నిర్వహించి గ్రామీణుల్లో ఎన్నికల పట్ల అవగాహన చేస్తున్నారు. జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల వేళ పోలీసులు జిల్లాలోని గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. చీమ చిటుక్కమన్నా సమాచారం చేరేలా పట్టుబిగిస్తున్నారు. ఒకవైపు తనిఖీలు… మరోవైపు అవగాహనలతో ప్రజల్లో ఎన్నికల వేళ భరోసా నింపుతున్నారు. కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు, గ్రామాసందర్శనలు, గ్రామ సభలు తీవ్రం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా తీవ్ర కృషి చేస్తున్నారు. ప్రతీ రోజూ గ్రామాలకు వెళ్లి ట్రబుల్ మాంగర్స్ , రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. నాటు సారా తయారీ, విక్రయాల కట్టడి కోసం సారా తయారీ స్థావరాలు, పశువుల పాకలు, గడ్డివాములు, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించి ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి తెలియజేస్తున్నారు. ఎన్నికల వేళ ఏమి చేయాలో, ఏమి చేయకూడదో సూచిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లొద్దని… గొడవలు, అల్లర్లకు దిగి కేసుల్లో ఇరుక్కుపోవద్దని వివరిస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పరిస్థితులు కల్పిస్తామని… ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement